Akkineni National Award | నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024వ సంవత్సరానికి గాను అగ్ర నటుడు చిరంజీవికి ఇవ్వనున్నట్టు అక్కినేని కుటుంబం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 28న జరిగే ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. పలువురు సినీరంగ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇదిలావుంటే.. పురస్కార స్వీకర్త చిరంజీవిని శుక్రవారం అక్కినేని నాగార్జున మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రాన్ని అందించి, వేడుకకు ఆహ్వానించారు.
అక్కినేని అవార్డు అందుకునేందుకు పరిపూర్ణమైన అర్హత గల నటుడు చిరంజీవి అని, తెలుగు చిత్రపరిశ్రమ తరఫున పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి అక్కినేని అయితే.. మలి వ్యక్తి చిరంజీవి అని నాగార్జున గుర్తుచేశారు. అందుకే.. ఈ నెల 28న జరిగే పురస్కార ప్రదాన సభలో పద్మవిభూషణ్ అక్కినేని పురస్కారాన్ని, అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకుంటారని నాగార్జున శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
‘మా నాన్న ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకం. ఈ మైలురాయికి గుర్తుగా ‘ఏఎన్ఆర్ అవార్డ్స్ 2024’కి అమితాబ్, చిరంజీవిగార్లను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు వేడుకను మరపురానిదిగా చేద్దాం’ అంటూ నాగ్ తన ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా చిరంజీవిని తాను ఆహ్వానిస్తున్న ఫొటోలను కూడా నాగ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.