‘దేవుడ్ని నేను ఎప్పుడూ ఏదీ అడగలేదు. నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. కానీ ఇటీవల తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకున్నప్పుడు మాత్రం మా వాడికి ఓ హిట్టివ్వమని అడిగాను. ఈ సినిమాకు వాయిస్ఓవర్ ఇచ్చిన నాకు పెద్దబ్బాయిలాంటి తారక్‌కు థాంక్స్. ఏడాది క్రితం ‘తండేల్’ సక్సెస్‌మీట్ జరిగింది. ఇప్పుడు ‘లెనిన్’కోసం ఇక్కడకు వచ్చాను. చైతూ, అఖిల్ నాకు రెండు కళ్లలాంటివారు’ అన్నారు అగ్రహీరో అక్కినేని నాగార్జున. శనివారం హైదరాబాద్‌లో ‘లెనిన్’ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. అక్కినేని అఖిల్ కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘లెనిన్’ చిత్రం శుక్రవారం విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘అఖిల్ ఆ మధ్య కొంచెం డల్ అయ్యాడు. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడుతున్నా విజయానికి ఒక్క అడుగుదూరంలో ఆగిపోతున్నాడు. అఖిల్ చేతికి సర్జరీ జరిగినప్పుడు చాలా భయపడ్డాను. గాయం నుంచి కోలుకున్నాక అఖిల్ పూర్తిగా మారిపోయాడు.
ప్రశాంతమైన వ్యక్తిలా కనిపించాడు. తోడు కూడా వచ్చింది. దాంతో వాడికి గుడ్టైమ్ స్టార్ట్ అయిందనే భావన కలిగింది. ఇక సినిమా ైక్లెమాక్స్‌లో అఖిల్ అదరగొట్టాడు.అక్కినేని ఫ్యాన్స్ అఖిల్, చైతన్య హిట్ కొట్టాలని తపిస్తుంటారు.‘తండేల్’ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు. ఇప్పుడు ‘లెనిన్’ విషయంలో కాలర్ ఎగరేస్తున్నారు. నేను సినిమాల విషయంలో ఎవరితో భాగస్వామ్యం తీసుకోను. కానీ నాగవంశీతో కలిసి మున్ముందు సినిమాలు చేస్తాను’ అన్నారు. కంటెంట్ ఉంటే సినిమా తప్పకుండా ఆదరణ పొందుతుందని ‘లెనిన్’ ప్రూవ్ చేసిందని హీరో అఖిల్ అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘అఖిల్ హిట్ కొట్టాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. సినిమాకు అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నది. హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. మరిన్ని స్క్రీన్స్ కావాలని కోరుతున్నారు’ అన్నారు. హైదరాబాద్ తన కర్మభూమి అని, తన చివరి చిత్రాన్ని కూడా ఇక్కడే చేయాలనుందని అంటూ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే భావోద్వేగంతో మాట్లాడింది.