ప్రేమికులు తమ ప్రేమకోసం ఎంత బలంగా నిలబడతారో అనే అంశాన్ని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారని చెప్పారు చిత్ర నాయకానాయికలు అఖిల్‌రాజ్, తేజస్విని. సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరోహీరోయిన్లిద్దరూ విలేకరులతో ముచ్చటించారు.
హీరో అఖిల్‌రాజ్ మాట్లాడుతూ ‘మాది వరంగల్ జిల్లా. ఇంటర్ చదివిన తర్వాతే ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టా. యాంకర్‌గా పనిచేయడంతో పాటు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పేరు తెచ్చుకున్నా. నా తొలిచిత్రం ‘విందుభోజనం’ థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో వచ్చింది. చాలా ఆడిషన్స్ తర్వాత ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి సెలెక్టయ్యా’ అని చెప్పారు.
సినిమాలో తాను పోషించిన రాజు పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని, స్క్రిప్ట్ చదివినప్పుడు క్లైమాక్స్‌లో ఊపిరి ఆడనట్లు అనిపించిందని, నిజ జీవితంలో ఆ ప్రేమికులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం విషాదకరమని అఖిల్రాజు చెప్పారు. తన సొంత ఊరు రాజమండ్రి అని, ఈ సినిమా కోసం తెలంగాణ యాసను బాగా ప్రాక్టీస్ చేశానని చెప్పింది కథానాయిక తేజస్విని. ధైర్యవంతురాలైన అమ్మాయి రాంబాయిగా ఇందులో కనిపిస్తానని, క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు ఎమోషనల్‌గా ఫీలయ్యానని, సినిమా చివరి 30 నిమిషాలు హార్ట్‌టచింగ్‌గా ఉంటుందని తేజస్విని చెప్పింది.