Akhil Akkineni | నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా వేదికగా సురేఖ మాటలపై సినీ తారలు మండిపడ్డారు . తాజాగా అఖిల్ అక్కినేని సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వరుస పోస్టులు చేశారు. మంత్రి సురేఖను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని హెచ్చరించారు.
‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నీచ స్థాయిలో ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా రక్షణ కల్పించాల్సిన ఆమె నైతిక విలువలను విస్మరించి దారుణమైన మాటలతో తెగబడింది. ఆమె ప్రవర్తించిన విధానం, మాట్లాడిన మాటలు ఏమాత్రం క్షమించరానివి. ఆమె వ్యాఖ్యలతో సమాజంలో గౌరవమర్యాదలు కలిగిన కుటుంబం మనసు గాయపడింది. స్వార్థ రాజకీయ యుద్ధంలో గెలిచేందుకు ఉన్నతమైన విలువలు, సామాజిక హోదా ఉన్న వ్యక్తులపై దాడి చేసి వారిని బలి పశువులు చేశారు. ఈ విషయంలో అక్కినేని కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండదలచుకోలేదు. ఇలాంటి సిగ్గులేని వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి. మన సమాజంలో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదు. వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు’ అని అఖిల్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.