Jai Akhanda | నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చిందంటే ఆయన అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులకు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉంటుందన్న విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రం అభిమానులను అలరిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ‘అఖండ’ విజయపరంపరను కొనసాగిస్తూ వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ తన నట విశ్వరూపంతో, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారని తెలుస్తోంది. థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల సందడి మామూలుగా లేదు. పెద్ద ఎత్తున డప్పులు, డాన్సులు, బాణసంచా కాల్చుతూ చేస్తున్న ‘ఫ్యాన్స్ రచ్చ’ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే అభిమానుల ఆనందాన్ని పతాక స్థాయికి చేర్చింది సినిమా క్లైమాక్స్. ఊహించని విధంగా చిత్రబృందం ఈ సినిమా చివర్లో ‘అఖండ 3’ కి సంబంధించిన హింట్ ఇచ్చింది. మూడో భాగం ‘జై అఖండ’ (Jai Akhanda) పేరుతో రాబోతున్నట్లు టైటిల్స్‌లో ప్రకటించడంతో నందమూరి అభిమానులు మరింతగా ఖుషీ అవుతున్నారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మరో మాస్ జాతర ఖాయం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.