
‘బోయపాటి శ్రీను ఇంతవరకు ఏ సినిమా కథ కూడా పూర్తిగా చెప్పలేదు. ఆయన మీద నాకు అంత విశ్వాసముంది. తిరునాళ్లకు వెళ్లిన చందంగా ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంచి సినిమాకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ప్రేక్షకులు నిరూపించారు’ అని అన్నారు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించిన ‘అఖండ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా గురువారం విశాఖపట్నంలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘అభిమానులకు ఏం కావాలో బోయపాటికి తెలుసు. ఈ సినిమాలో వాళ్లకు కావాల్సినవన్నీ సమకూర్చారు. అందుకే ఈ స్థాయి విజయం దక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. జయాపజయాల్లో ఎప్పుడూ నా వెన్నంటి ముందుకు నడిపిస్తున్నారు. ఈ విజయాన్ని పరిశ్రమ విజయంగా భావిస్తున్నా’ అన్నారు. ‘ఈ సినిమాను హిట్ చేసి ఇండస్ట్రీకి ధైర్యాన్నందించారు. నా దృష్టిలో మాస్ అంటే అరిచి చెప్పేది కాదు. మంచి చెప్పి అరిచేలా చేసేది. ఈ సినిమాలో దేవుడు, ధర్మం గురించి చెప్పాం. వాక్ శుద్ధి, ఆత్మశుద్ధి ఉన్నవాళ్లు చెబితేనే జనాల్లోకి వెళ్తుంది. ఆ గుణాలన్నీ బాలయ్యలో ఉన్నాయి. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. అఖండ పూరించిన శంఖం ప్రపంచమంతా వినిపించింది. బాలయ్యతో మూడు సినిమాలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈ సినిమాలో ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మను గౌరవిస్తే భావితరాలు బాగుంటాయని చెప్పాం. అది ప్రజలకు బాగా చేరువైంది. ఈ విజయంతో పరిశ్రమను గెలిపించారు’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందుతున్నారని..థియేటర్ల వద్ద జాతర నడుస్తున్నదని నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి తెలిపారు. ఈ సినిమా చూస్తుంటే శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చినట్లుందని, తాను పోషించిన ప్రతినాయకుడి పాత్రకు మంచి స్పందన లభిస్తున్నదని నటుడు శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.