Akhanda 2 | సినిమా సక్సెస్ అంటే కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లే కాదు… అది ఎంతమందిని ప్రభావితం చేసింది, ఎవరి దాకా వెళ్లిందన్నది చాలా కీలకం. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అఖండ 2’ ఇప్పుడు అదే స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. థియేటర్ల వద్ద రికార్డుల వేట కొనసాగుతుండగానే, ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించే అవకాశం ఉందన్న ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా వెల్లడించడం విశేషం. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అఖండ 2’ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మోదీ గారు ఇప్పటికే ఈ సినిమా గురించి విన్నారని, చూడటానికి ఆసక్తి వ్యక్తం చేశారని బోయపాటి వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన డేట్, పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
ప్రధాని ఈ సినిమాపై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఇందులోని కాన్సెప్ట్ అని చిత్రబృందం భావిస్తోంది. ‘అఖండ 2’ కేవలం యాక్షన్ లేదా ఫ్యాక్షన్ మూవీ మాత్రమే కాదు. సనాతన ధర్మం, దేశభక్తి, ఆధ్యాత్మికత వంటి అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. దేశంపై బయోవార్ ముప్పు ఏర్పడినప్పుడు, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రజల్లో దైవభక్తి, నమ్మకాన్ని అఖండ ఎలా కాపాడాడు? అన్న అంశాలే ఈ సినిమాకు కేంద్రబిందువుగా నిలిచాయి. ప్రస్తుత కాలంలో దేశభక్తి, ధార్మిక విలువలు ప్రతిబింబించే సినిమాలకు విస్తృత ఆదరణ లభిస్తుండటం ‘అఖండ 2’కి మరింత బలంగా మారింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి భాగం ‘అఖండ’ ఇచ్చిన భారీ హైప్, సీక్వెల్‌పై ఉన్న అంచనాల వల్ల థియేటర్ల వద్ద సందడి పీక్ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఈ సినిమా వీక్షిస్తే, అది కలెక్షన్లకు మించి సినిమాకు ఓ ప్రత్యేక గౌరవంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదే కారణంతో ‘అఖండ 2’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోనూ భారీగా రిలీజ్ చేశారు. హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే డివోషనల్, దేశభక్తి అంశాలు సినిమాలో పుష్కలంగా ఉండటంతో అక్కడ కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే నార్త్ బెల్ట్‌లో ప్రమోషన్స్ జోరుగా సాగగా, ఇప్పుడు ప్రధాని మోదీ స్క్రీనింగ్ వార్త నిజమైతే అక్కడ సినిమాకు మరింత పబ్లిసిటీ లభించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.