Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అఖండ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కీలక షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా చేరుకుంది. అక్కడ బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం తర్వాత, దాని సీక్వెల్ ‘అఖండ 2’ (అఖండ 2 – తాండవం) పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు జార్జియాలోని సుందరమైన ప్రదేశాలను ఎంచుకుంది.
బోయపాటి శ్రీను ఈ యాక్షన్ బ్లాక్‌లను అత్యంత భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో విదేశీ ఫైటర్స్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు ఈ జార్జియా షెడ్యూల్లోనే బాలయ్య రెండో పాత్రకు సంబంధించిన ఒక భారీ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
గతంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ కూడా జార్జియాలో జరిగింది. ఇప్పుడు ‘అఖండ 2’ వంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి కూడా అదే లొకేషన్ ఎంచుకోవడంతో, విజువల్స్ అద్భుతంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
#akhanda2 #georgia shoot location pic.twitter.com/3CEzehWedw
— devipriya (@sairaaj44) May 29, 2025