ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఆర్కే టెలీషో పతాకంపై రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకుడు. జనవరి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఆకాష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘చిన్నతనం నుంచే నటుడు కావాలనే కోరిక ఉండేది. ఢిల్లీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత నా సినిమా డ్రీమ్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాను.
‘సర్కారు నౌకరి’ మంచి కంటెంట్ ఉన్న కథ. చక్కటి డ్రామా, కామెడీతో పాటు నేటి యువతకు సందేశం కూడా ఉంటుంది. 90వ దశకంలో ఈ కథ నడుస్తుంది. ఎయిడ్స్ మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తున్న ఆ కాలంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి వ్యాధిపై ప్రజల్లో ఎలాంటి అవగాహన కలిగించాడు? చివరకు తనకు నిర్ధేశించిన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అన్నదే కథాంశం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాం. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా హీరోగా లాంచ్కావడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు.