Ajith Kumar | కోలీవుడ్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించి టాప్ హీరోగా ఎదిగాడు. మాస్ హీరోగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది.ఇటీవల పద్మ భూషణ్ అవార్డ్ కూడా అందుకున్నాడు అజిత్. స్వయంకృషితో ఎదిగి ఈ స్థాయికి వచ్చిన అజిత్ కోట్లాదిమంది అభిమానుల ప్రేమని దక్కించుకున్నాడు. అజిత్ చదివింది పదో తరగతి కాగా, ఆయన నటుడిగా, రేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . అయితే అజిత్ గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అజిత్ కుమార్ మూలాలు అఖండ భారత దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన దేశంలో ఉన్నాయట. అజిత్ తండ్రి పి సుబ్రహ్మణ్యన్ కేరళ లోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందినవారు.
అజిత్ తల్లి మోహిని పాకిస్తాన్‌లోని కరాచీ ప్రాంతానికి చెందినవారు. అంటే సింధ్‌కు చెందిన సింధీ హిందూ. అంటే అతనికి సింధీ వారసత్వం ఉంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి అనేక మంది హిందువులు భారత దేశానికి కాందిశీకులుగా తరలి వచ్చారు. తల్లి కుటుంబం అలానే తరలి వచ్చింది.అలా వచ్చిన అజిత్ అమ్మమ్మగారి ఫ్యామిలీ కొల్‌కత్తాకి వచ్చి స్థిరపడ్డారు. అయితే అజిత్ కుమార్ మాత్రం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించారు. అందుకే తెలుగు అభిమానులు కూడా అజిత్‌ని ఎంతో ఇష్టపడతారు. ఒక ఇంటర్వ్యూలో నా తల్లి కరాచీ (పాకిస్తాన్) నుండి వచ్చిందని చెప్పుకొచ్చారు అజిత్. అలా పాకిస్థాన్ నుంచి భారత్ తరలివచ్చిన ప్రముఖుల్లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అలాగే భారత మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ , బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వంటి వారు కూడా ఉన్నారు.
ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొందరు పనిగట్టుకొని సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. రీసెంట్గా కొందరు దుర్మార్గులు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసుకుని అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం వ్యక్తి అని, అతను నందమూరి తారక రామారావుగా మార్చుకున్నారని నెటిజన్లు అంటున్నారు. ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న తర్వాతే అతనికి సరైన గుర్తింపు వచ్చిందని, సినిమాల్లో కూడా స్టార్‌గా ఎదిగాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ప్రచారంపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.