కొన్ని కథలు కొందరు హీరోలను కోరుకుంటూ ఉంటాయి. వైబ్రేషన్స్ వర్కవుట్ అయి, అవి ఆ హీరోలను చేరుకుంటూ ఉంటాయి. ఇదే డెస్టినీ. ఒకరి కోసం తయారైన కథకు వేరొకరు కథానాయకుడు కావడం వెనుక కారణం అదే. గతంలో అలాంటివి చాలా జరిగాయి. ప్రస్తుతం మైత్రీ మూవీమేకర్స్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నిర్మించనున్న సినిమా విషయంలో కూడా ఇలాంటిదే జరిగేట్టు కనిపిస్తున్నది.
రవితేజ కోసం మలినేని గోపీచంద్ తయారు చేసుకున్న ఈ కథ, వేరే హీరోకు వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం. నిజానికి రవితేజ హీరోగా ఈ సినిమా నిర్మించడానికి మైత్రీవారు సర్వసన్నాహాలు చేసుకున్నారు. అయితే.. కథలోని బలమైన కంటెంట్ దృష్ట్యా.. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తేనే ఈ కథకు తగిన న్యాయం జరుగుతుందని నిర్మాతలు భావించినట్టు సమాచారం. అందుకే తెలుగుతోపాటు తమిళ మార్కెట్ కూడా కలిసొచ్చే విధంగా ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఇందులో భాగంగానే ఈ కథను తమిళ స్టార్హీరో అజిత్‌కు వినిపించారట దర్శక, నిర్మాతలు. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు ఫిలింవర్గాల భోగట్ట. ఈ వార్తే నిజమైతే దాదాపు ముప్పైఏళ్ల తర్వాత అజిత్ తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమా ఇదే అవుతుంది. అజిత్ తన కెరీర్ ప్రారంభంలో ‘ప్రేమపుస్తకం’ అనే తెలుగు సినిమాలో హీరోగా చేశారు. ఆ తర్వాత తమిళంలో పెద్ద హీరోగా ఎదిగారు. ఆయన తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై అఖండ విజయాలు చవిచూశాయి. ఆ విధంగా తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నారు అజిత్.