Ajith | తమిళనాట ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటులలో అజిత్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే అజిత్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. ముందుగా విడముయర్చి సినిమాతో పలకరించాడు. ఈ మూవీ పరాజయం పాలైంది. ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అజిత్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. ఇక రీసెంటగా అజిత్‌కి పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు అజిత్.
అజిత్ అత్యున్నత పురస్కారం అందుకున్నాడని ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుష్ అవుతున్న సమయంలో ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనే విషయం బయటకు వచ్చింది. ఇది తెలిసి అందరు ఉలిక్కిపడ్డారు.పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన తర్వాత,అజిత్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అభిమానులు పెద్ద సంఖ్యలలో అజిత్‌ని చూసేందుకు ఎయిర్‌పోర్టులో గుమికూడటంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో అజిత్ కాలికి స్వల్పంగా గాయమైనట్లు తెలిసింది.అయితే ఇది పెద్దగా ఆందోళనకరం కాదని, ప్రమాదమేమి లేదని వైద్యులు స్పష్టం చేశారు.
ఆయనను ఈ సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశమున్నట్లు అజిత్ టీమ్ జాతీయ మీడియాకు తెలియజేసింది. ఇక కొద్ది రోజుల క్రితం అజిత్ కార్ రేస్ లో గాయపడిన విషయం తెలిసిందే.రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో అజిత్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. 2025 ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.ఇదే సంవత్సరం జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. 2025 ఫిబ్రవరి 10న పోర్చుగల్‌లో జరిగిన కారు రేస్ పోటీల కోసం శిక్షణలో ఉండగా అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైన విషయం విదితమే.