Ajith | తమిళనాడులోని కరూర్‌లో దళపతి విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన విజయ్ బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు.సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ ర్యాలీలో ఊహించిన దానికంటే ఎక్కువ మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు విజయ్ రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ సమావేశం ద్వారా విజయ్ బాధిత కుటుంబాలకు తన మానసిక మద్దతు, సానుభూతి వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికీ విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘటనపై అజిత్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఈ ఘటనకి విజయ్‌తో పాటు ప్రతి ఒక్కరు బాధ్యులేనని అజిత్ స్పష్టం చేశారు. మీడియాతో పాటు ఫ్యాన్స్, ఇతర వర్గాలు కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. కరూర్ లాంటి రాజకీయ కార్యకలాపాలని పూర్తిగా నివారించాలంటూ అజిత్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నేను అనడం లేదు. కాని ఆ రోజు జరిగిన ఘటన తమిళనాట అన్నింటిని మార్చేసింది.
కరూర్ ఘటనకి విజయ్‌తో పాటు మన తప్పు కూడా ఉంది. అందరం బాధ్యత వహించాల్సిందే. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వేల మంది వెళుతూ ఉంటారు. కాని వారందరు సురక్షితంగానే ఇంటికి తిరిగి వస్తారు కదా. సినీ స్టార్స్‌కి సంబంధించిన సభల్లో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి. వీటిపై మీడియా మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది. సినిమా థియేటర్‌కి వెళ్లిన అలానే
జరుగుతుంది. ఇండస్ట్రీ చుట్టూ ఇలాంటి విషాదాలు నెలకొనడం వలన పరిశ్రమకి చెడ్డ పేరు వస్తుందని అజిత్ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం అజిత్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.