Ajith | తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన అభిమానులకు ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం లో ఎదురైన కష్టాలు, విమర్శలు, విజయాలు… అన్నింటినీ ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. నా సినీ జీవితం ఒక్కరోజూ సాఫీగా సాగలేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాలేదు. నేను బయట వ్యక్తిని. నా స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు అంటూ అజిత్ పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడులు, వైఫల్యాలు ఎదురైనా కూడా వెనక్కి తగ్గలేదు.
సినిమాల్లో ఊహించలేని పరాజయాలను చూశాను. దుర్భర సమయాల్లోనూ మీరు నాకు అండగా నిలిచారు. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీరు నాతో ఉన్నారు. మీ ప్రేమే నన్ను నిలబెట్టింది,” అని అభిమానులపై తన కృతజ్ఞతలు తెలియజేశారు. మోటార్ రేసింగ్‌లోనూ ఎన్నో గాయాలయ్యాయి. కొంతమంది నన్ను ఆపేందుకు ప్రయత్నించారు. అయినా నేను ఊహించిన స్థాయికి ఎదిగాను. ధైర్యంగా ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమని చూపించాను అని వివరించారు. తన జీవిత భాగస్వామి షాలిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆమె నా వెన్ను బలంగా నిలిచింది. ఆమె లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు” అని తెలిపారు.
“నేను ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు, ఎప్పుడూ మీతో మాట్లాడకపోవచ్చు. కానీ మీ ప్రేమను ప్రతి క్షణం ఆస్వాదిస్తాను. నా లోపాలను కూడా అంగీకరించిన మీరు నిజంగా గొప్పవారు,” అని అజిత్ పేర్కొన్నారు. తన అభిమానులతో పాటు విమర్శకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అజిత్. విమర్శలే నాకు మరింత మెరుగవ్వాలనే స్పూర్తినిచ్చాయి అని వెల్లడించారు. భవిష్యత్‌లో మోటార్ రేసింగ్లోను మన దేశం గర్వపడే స్థాయికి తీసుకెళ్తాను అంటూ తన లక్ష్యాన్ని తెలియజేశారు. అజిత్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు THALA హ్యాఫ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు అజిత్ 33 ఏళ్ల సినీ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ హృదయపూర్వక పోస్ట్‌లు చేస్తున్నారు. అజిత్ కుమార్ నటుడిగా మాత్రమే కాకుండా రేసర్, ఫిలాసఫర్ గా కూడా అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.