Irumudi | మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం సక్సెస్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటుడు అజయ్ ఘోష్ తన పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమాలో ఆయన పోషించిన పాత్ర మొదట అనుకున్నది కాదని చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘ఇరుముడి’లో ఎమ్మెల్యే పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రను మొదట అజయ్ ఘోష్‌కు ఇవ్వాలని చిత్రబృందం భావించిందట. అయితే దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు, రవితేజతో జరిగిన చర్చల తర్వాత ఆయనకు మరో పాత్రను కేటాయించారు.దీనికి ప్రధాన కారణం అజయ్ ఘోష్ గతంలో చేసిన పాత్రలే అట. సాధారణంగా ఆయన తెరపై కనిపించే విధానం, గత చిత్రాల్లో చేసిన పాత్రలను బట్టి.. అజయ్ ఘోష్ ఎమ్మెల్యే పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు వెంటనే ఆయనే సినిమాలో ప్రతినాయకుడని ఊహించే అవకాశం ఉందని చిత్రబృందం భావించిందట. సినిమాలో ట్విస్టులు, కథనం కీలకంగా ఉండటంతో ప్రేక్షకులకు ముందుగానే విలన్ ఎవరో తెలిసిపోవడం చిత్రానికి మైనస్‌గా మారే అవకాశం ఉందని మేకర్స్ భావించారట. అందుకే ఎమ్మెల్యే పాత్రకు మరో నటుడిని ఎంపిక చేసి, అజయ్ ఘోష్‌కు భిన్నమైన పాత్రను ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఈ నిర్ణయం వల్ల కథలోని కీలక అంశాలు ప్రేక్షకులకు ముందుగానే అర్థం కాకుండా చేయగలిగామని అజయ్ ఘోష్ చెప్పారు. ఒక నటుడి గత ఇమేజ్ కూడా సినిమాలో పాత్ర ఎంపికపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటనతో మరోసారి స్పష్టమవుతోంది. రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘ఇరుముడి’లో బేబీ నక్షత్ర, సాయికుమార్, స్వాసిక విజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. శివ నిర్వాణ తనదైన శైలిలో భావోద్వేగాలను, కుటుంబ అనుబంధాలను కథలో మిళితం చేయడంతో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.సినిమా వసూళ్లు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటాయి. దీంతో రవితేజ కెరీర్లో మరో భారీ విజయంగా ‘ఇరుముడి’ నిలిచింది.