తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్‌ని అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. కథానాయిక దామినికి ఊరంతా భయపడుతుంటారు. అందుక్కారణం..ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ కొడుతుంది. ఈ రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వారి దాంపత్యం ఎలా సాగింది? అన్నదే ఈ చిత్ర కథాంశం. పల్లెటూరి నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం వినోదం, భావోద్వేగాల కలబోతగా సాగింది. మురళీధర్ గౌడ్, విష్ణు ఓయి, ఝాన్సీ, ఆమని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భరత్ మంచిరాజు, దర్శకత్వం: భరత్ దర్శన్.