Aishwarya Rajesh | ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. తన కెరీర్లో ఎదురైన సవాళ్లు, ఇండస్ట్రీలోని వాస్తవ పరిస్థితులపై ఆమె చాలా నిజాయితీగా మాట్లాడుతోంది. ఈ క్రమంలో కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఆమె ఇటీవల ఒక పాడ్‌క్యాస్ట్‌లో వెల్లడించగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, నటిగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో ఓ సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడట. పాత్ర పేరుతో తనను సెక్సీ దుస్తులు, నైట్ డ్రెస్సులో చూడాలంటూ మాట్లాడటంతో తీవ్ర అసహనం, కోపం కలిగిందని ఐశ్వర్య వెల్లడించింది.
అతడు పాత్ర గురించి కాదు, నా శరీరాన్ని చూడాలనే ఉద్దేశంతోనే అలా అడిగాడని అర్థమైంది. ఆ సమయంలో నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి ప్రవర్తనతో అతడు ఇంకెంతమందిని వేధించాడో అని ఆలోచించడమే మరింత కలచివేసింది అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో ముందుగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత టాలీవుడ్లో అడుగుపెట్టింది ఐశ్వర్య రాజేష్. ఆమెకు సినిమాల నేపథ్యం ఉన్నా, దాన్ని ఆసరాగా చేసుకోకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి కష్టపడింది. గ్లామర్ హీరోయిన్ ఇమేజ్‌కు దూరంగా ఉండి, బలమైన పాత్రలు, మహిళా ప్రధాన కథలతో తన నటనకు ప్రాధాన్యం ఇచ్చింది. ‘కౌసల్య కృష్ణమూర్తి’తో తెలుగులో పరిచయమైన ఆమెకు ఆ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’ వంటి అవకాశాలు వచ్చినా, అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు.
అయితే దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఐశ్వర్య రాజేష్ కెరీర్‌కు కొత్త మలుపు వచ్చింది. భాగ్యలక్ష్మి పాత్రలో ఆమె చేసిన గోదావరి యాస, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సీరియస్ పాత్రలకే పరిమితమైన ఆమె, ఈ సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపించి తనలో మరో కోణం ఉందని నిరూపించింది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. మహిళల వస్త్రధారణపై జరుగుతున్న చర్చపై కూడా ఐశ్వర్య తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఎవరైనా తన దుస్తుల గురించి సలహా ఇస్తే, ఎదుటివారికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఆ మాటను గౌరవిస్తానని చెప్పింది. అయితే ఇతరుల దుస్తుల విషయంలో మాత్రం తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికీ వారి ఇష్టం ఉంటుంది. ఎవరికి నచ్చిన దుస్తులు వాళ్లు వేసుకుంటారు’’ అని ఆమె వ్యాఖ్యానించింది.