Aishwarya Rai | తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లినా పిల్లల్ని వెంటతీసుకెళ్లడం మామూలే! అయితే, ఇదంతా సామాన్యుల విషయంలోనే! సెలెబ్రిటీల దగ్గరికి వచ్చేసరికి మాత్రం.. అది ఓ సెన్షేషన్ అవుతుంది. తాజాగా, అందాల తార ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యను పలు వేడుకలకు తీసుకెళ్లడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అబుదాబి వేదికగా ఇటీవల జరిగిన ఐఫా-2024 వేడుకలకు ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యను వెంట తీసుకెళ్లింది. రెడ్ కార్పెట్‌పై కూతురితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఈ సందర్భంగా ఓ విలేకరి ‘మీ కూతురు ఆరాధ్య మీవెంటే ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నది..’ అని ఇంకా ఏదో అడగబోతుండగా.. ఐశ్వర్య అసహనం వ్యక్తం చేసింది. ‘తను నా కూతురు. ఎప్పుడూ నాతోనే ఉంటుంది!’ అంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు వీటిని నెగెటివ్‌గా తీసుకుంటున్నారు.
అభిషేక్‌తో ఆమె విడాకులు తీసుకోబోతున్నదనీ.. అందుకే, తన బిడ్డ ఎప్పుడూ తనతోనే ఉంటుందని చెప్పుకొచ్చిందంటూ తెగ ట్వీటుతున్నారు. బచ్చన్ అభిమానులు మాత్రం.. ఆ పోస్టులను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ వేడుకకు సైతం ఐశ్వర్య తన కూతురిని వెంట తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
దాదాపు నాలుగేండ్ల తర్వాత ‘పొన్నియన్ సెల్వన్’తో తెరపై మెరిసింది ఈ అందాల తార. కీలక పాత్రలో నటించి.. అభిమానులను అలరించింది. పార్ట్-2లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చి.. ఉత్తమ నటిగా 2024 ఐఫా అవార్డును అందుకున్నది. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్.. విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్దికాలంగా బీటౌన్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బచ్చన్ దంపతులు అధికారికంగా స్పందించకపోవడం, తన కూతురు తనతోనే ఉంటుందని ఐశ్వర్య కామెంట్స్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.