మిస్ వరల్డ్ టైటిల్ గెలవడంతో తన జీవితమే మారిపోయిందని అంటున్నది ఐశ్వర్యరాయ్ బచ్చన్. అనుకోకుండానే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నాననీ, టైటిల్ గెలుస్తానని కూడా అనుకోలేదనీ చెబుతున్నది. యాభై ఏండ్లు దాటినా వన్నె తగ్గని అందంతో అలరిస్తున్నదీ మాజీ ప్రపంచసుందరి. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకొని 30 ఏళ్లు దాటినా.. ఆమెపై అభిమానుల్లో ఇప్పటికీ అదే క్రేజ్ ఉన్నది. తాజాగా, రెడ్సీ ఫిల్మ్ ఫెస్టివల్-2025లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది ఐశ్వర్య. ఈ సందర్భంగా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. అందాల పోటీలు, సినిమా కెరీర్ గురించిన పలు విషయాలను పంచుకున్నది.
“1994 మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి అంచనాలు లేకుండానే పాల్గొన్నా. నిజానికి అప్పడది అందాల పోటీలా అనిపించలేదు. టైటిల్ గెలుస్తానని కూడా అనుకోలేదు. కానీ, ఓ అంతర్జాతీయ పోటీలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావించి.. ఆ పోటీల్లో పాల్గొన్నా. అందుకే వేదికపై మన దేశం గొప్పతనాన్ని చెప్పా. ఇక మిస్ వరల్డ్ టైటిల్ గెలవడంతో నా జీవితమే మారిపోయింది” అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నది. తన నటనా జీవితంతోపాటు తల్లిగా తన బాధ్యతల నిర్వహణ గురించీ చెప్పుకొచ్చింది. “నేను ఆరాధ్యను జాగ్రత్తగా చూసుకోవడంలో, అభిషేక్‌తో కలిసి ఉండటంలో చాలా బిజీగా ఉన్నాను. ఏదైనా సినిమాకు సంతకం చేయకపోయినంత మాత్రాన.. నేను అభద్రతకు లోనవ్వను.
నిజానికి నా జీవితంలో ఎప్పుడూ అభద్రతకు గురవ్వలేదు. ఎందుకంటే.. అభద్రతలు ఎప్పుడూ మనల్ని నడిపించలేవు” అంటూ వెల్లడించింది. 94 మిస్ వరల్డ్ టైటిల్ గెలవడంతో.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఐశ్వర్యరాయ్ పేరు మార్మోగిపోయింది. ఆమె ఇంటి ముందు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్’ చిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించింది ఐశ్వర్య. బాలీవుడ్ నుంచీ వరుస ఆఫర్లు అందుకున్నది. అనతికాలంలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. అనేక విజయవంతమైన చిత్రాలు.. అద్భుతమైన నటనతో 30 ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్నది.
తన సినీ జీవితంలో ‘దేవదాస్’ సినిమా ఒక మైలురాయి నిలుస్తుందనీ, ఆ సినిమా తర్వాతే కథల ఎంపికపై పూర్తి అవగాహన వచ్చిందనీ అంటున్నది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ఇప్పటికీ తనకు అభిమానుల మద్దతు ఉన్నదనీ, అందరి ప్రేమా తనపై ఉన్నదని చెప్పుకొచ్చింది. 2007లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో పెళ్లిపీటలెక్కింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైనా.. అడపాదడపా తెరపై కనిపిస్తూనే ఉన్నది. చివరిసారి ’పొన్నియిన్ సెల్వన్ 2’లో కనిపించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.