Aha Naa Pellanta | తెలుగు సినిమా తెరపై హాస్యాన్ని, విలనిజాన్ని, ఏ పాత్రనైనా తనదైన శైలిలో సరికొత్త మ్యానరిజమ్స్‌తో నటించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విలక్షణ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాస రావు. రంగస్థలం నుంచి బుల్లితెర అక్కడనుంచి వెండి తెర వరకు కోట నట ప్రస్థానం సాగింది. తెలుగు భాషా చిత్రాలతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా విభిన్న క్యారెక్టర్లు చేసి తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు కోట శ్రీనివాసరావు.
కోట నటించిన మొదటి సినిమాలు ప్రాణం ఖరీదు, కుక్క, ఈ రెండు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత వందేమాతరం `ప్రతి ఘటన`చిత్రాలలో నటించి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కోటకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా అహనా పెళ్ళంట. ఈ సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్ర లో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి ఎన్ని ప్రశంసలు అందుకున్నాడో చెప్పనవసరం లేదు.
ఆ సినిమాలో లక్ష్మిపతి పాత్ర చేసే అవకాశం ఎలా వచ్చిందో గతంలో జరిగిన ఓ ఇంటర్య్వూలో ఇలా చెప్పుకొచ్చారు పద్మశ్రీ కోట శ్రీనివాస రావు.`అహ నా పెళ్ళంట`లో నాకు ఆ పిసినారి లక్ష్మిపతి పాత్ర రావడానికి కారణం జంధ్యాలే. ఒకసారి చెన్నై వెళదామని నేను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాను అక్కడ రామానాయుడు కనిపించారు. నన్ను చూడగానే దా కూర్చో, నువ్వు చాలా లక్కీ అన్నారు. విషయం ఏంటని అడిగితే జంధ్యాలతో ఒక సినిమా అనుకున్నాము అందులో ఒక కీలకమైన పిసినారి పాత్ర ఉంది, ఆ పాత్ర బాగా పండితే సినిమా చాలా పెద్ద సక్స్ స్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ గా మిగిలిపోతుంది. అయితే ఆ పాత్ర పోషించే అవకాశం నీకే ఇద్దామని నిర్ణయించుకున్నాము. ఇక నువ్వు లక్కీ అని ఎందుకన్నానంటే .ఆ క్యారెక్టర్ కి రావుగోపాలరావు అయితే బాగుంటుందని అనుకున్నాం, కానీ జంధ్యాల మాత్రం ఆ పిసినారి క్యారెక్టర్ కి నువ్వే చేయాలని పట్టు పట్టి కుర్చున్నారు అని చెప్పారు.
ఆ పాత్రకి రావుగోపాలరావు సరిపోరని జంధ్యాల అభిప్రాయం. ఎందుకంటే రావుగోపాలరావులో రాజసం ఉంటుంది. ఆహార్యంలో ఎంత మార్పు చేసిన ఆయన గాంభీర్యం పాత్రను డామినేట్ చేస్తుందని ఫీలయ్యారు జంధ్యాల. అలా అనుకోకుండా వచ్చిన అవకాశమే పరిశ్రమలో నన్ను పాతుకుపోయేలా చేసింది. మొదట్లో ప్రతి ఘటన సినిమాతో ఎలా ఓవర్ నైట్ స్టార్ ని అయిపోయానో మళ్లీ అంత పేరు తెచ్చి పెట్టిన సినిమా అహనా పెళ్ళంట అని కోట శ్రీనివాస రావు తనకి ఆ సినిమాలో వచ్చిన అవకాశం గురించి చెప్సుకొచ్చారు.ఆ విధంగా వచ్చిన ఆ పాత్ర ను పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును స్థాపించుకున్నారు.