‘విరాటపర్వం’ తర్వాత హీరోగా తెరపై కనిపించలేదు రానా. తాజాగా ‘వేట్టయాన్’లో విలన్‌గా తలైవాను ఢీకొట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. హీరోగా ఎదగడం కంటే.. నటుడిగా గెలవడమే రానాకు ఇష్టంలా ఉంది. మరోవైపు తాత, తండ్రి వారసత్వాన్ని కూడా కొనసాగిస్తూ నిర్మాతగా కూడా ముందుకు సాగుతున్నారు రానా. ఇటీవలే ‘35 చిన్నకథ కాదు’ చిత్రాన్ని విడుదల చేసి, విమర్శకుల ప్రశంసలందుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం తమిళంలో శింబు కథానాయకుడిగా రూపొంది, ఘన విజయాన్ని అందుకున్న ‘మానాడు’ చిత్రాన్ని ఆయన హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఈ సినిమాను తెలుగులోనే రీమేక్ చేయాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు హిందీలో చేయడానికి రానా రంగం సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ‘ఆకాశవాణి’ చిత్ర దర్శకుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మరి ఈ రీమేక్‌లో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సివుంది.