Nayanthara Vs Dhanush | తమిళ అగ్ర నటులు ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత రాజుకుంది. ఈ నెల 16న ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన లేఖలో ధనుష్ వ్యవహార శైలిపై, వ్యక్తిత్వంపై నయనతార తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్ తనపై ఈర్ష్యను పెంచుకున్నాడని, అతనిది అల్పబుద్ధి అని, దిగజారుడు వ్యక్తిత్వం అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడింది నయనతార. ఈ వివాదం మొత్తానికి ఆమె జీవిత విశేషాలతో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కేంద్రమైంది. సోమవారం నుంచి ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. నయనతార డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీదాన్’ (తెలుగులో ‘నేనూ రౌడీనే’) సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల నిడివిగల క్లిప్‌ను ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పారు.
ఈ సినిమాకు నిర్మాత ఆయనే కావడంతో కాపీరైట్ యాక్ట్కింద 10కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ నయనతార టీమ్‌కు నోటీసులు పంపించాడు. దాదాపు రెండేళ్ల నుంచి సినిమా క్లిప్‌ను ఉపయోగించుకునే విషయంలో ధనుష్‌తో జరిపిన చర్చలు విఫలం కావడం, పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో నయనతారలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో నయనతార ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన లేఖను రాసింది. తాజాగా ఈ వివాదం మరోమలుపు తిరిగింది. నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించిన ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని ధనుష్‌కు చెందిన లాయర్ నయనతారకు నోటీసులు పంపారు.
అయితే ఈ విషయంలో నయనతార వాదన మరోలా ఉంది. డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా తాలూకు ఒరిజినల్ క్లిప్‌లను తీసుకోలేదని, షూటింగ్ సందర్భంగా పర్సనల్‌గా తీసుకున్న బిహైండ్ సీన్స్ ఫుటేజీని వాడుకున్నామని నయనతార చెబుతున్నది. దీనిపై ధనుష్ తరపున లాయర్ తన నోటీస్‌లో స్పందించారు. సినిమాకు సంబంధించిన కంటెంట్‌పై నిర్మాతకు సర్వహక్కులు ఉంటాయని, పర్సనల్ ఫోన్లలో షూట్ చేసిన వీడియోలను కూడా ఉపయోగించే వీలు లేదని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు.
నయనతార రాసిన లేఖ తమిళ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు వీరిమధ్య వివాదానికి ఎక్కడ బీజం పడిందంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే…‘నానుమ్ రౌడీదాన్’ (2015) షూటింగ్ సమయంలోనే దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో చిత్ర కథానాయిక నయనతార ప్రేమలో పడింది. ఏడేళ్ల ప్రేమాయణం అనంతరం వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు విఘ్నేష్, నిర్మాత ధనుష్ మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్ మించిపోతున్నదంటూ విఘ్నేష్‌పై అసంతృప్తిగా ఉండేవారు ధనుష్. సినిమా డిజాస్టర్ అవుతుందని తన సన్నిహితులతో చెప్పేవారు. అయితే ఆయన అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘నానుమ్ రౌడీదాన్’ పెద్ద హిట్‌గా నిలవడమే కాకుండా విఘ్నేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
ఈ పరిణామాలతో ధనుష్ ఇగో హర్ట్ అయిందని చెబుతారు. ఇదే విషయాన్ని నయనతార తన లేఖలో పరోక్షంగా ప్రస్తావించింది. ‘సినిమా సక్సెస్‌కావడంతో ధనుష్ అంచనాలన్నీ తప్పాయి. విఘ్నేష్‌ను నిందించే అవకాశం లేకపోవడంతో ఆయన ఇగో హర్ట్ అయింది. అందుకే 2016 ఫిల్మ్‌ఫేర్ ప్రదానోత్సవంలో కూడా తన అక్కసును వెళ్లగక్కాడు’ అంటూ నయనతార లేఖలో రాసుకొచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందోనని తమిళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.