Konda Surekha | అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నటి సమంతతో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సమంతకు నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు.
అయితే కొండా చేసిన వ్యాఖ్యలకు గాను హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. నాంపల్లి మనోరంజన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో కేసును వాయిదా వేస్తూ.. సోమవారం విచారణ చేపట్టనున్నట్లు మనోరంజన్ కోర్టు ప్రకటించింది.
ఇదిలావుంటే ఫిలిం ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. కొండా సురేఖ విషయంలో నాగార్జున చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. తన కుటుంబ పరువుకు భంగం కలిగించినందుకు నాగార్జున మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా.. దీనిపై నాగార్జున అధికారికంగా స్పందించాల్సి ఉంది.