ఆదిత్య ఓం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బందీ’. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్నారు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత రఘు తిరుమల మాట్లాడుతూ ‘కేవలం ఒకే ఒక్క పాత్రతో ఈ సినిమా చేశాం. హీరో ఆదిత్య వర్మ అనే పాత్రలో కనిపిస్తాడు.
ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దన్నుగా నిలిచే లీగల్ అడ్వైజర్ అయిన ఆదిత్యవర్మను ఓ అడవిలో వదిలేస్తే ఏం జరిగింది? అతను తన తప్పులను తెలుసుకొని ప్రకృతి నుంచి ఏం నేర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథాంశం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వీరల్, లవన్, సుదేష్ సావంత్, నిర్మాతలు: వెంకటేశ్వరావు దగ్గు, రఘు తిరుమల.