ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ ఇటీవలే ప్రేక్షుకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ‘రామజయం రఘు రామ జయం’ పేరుతో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. నైజాంలో దాదాపు 500 స్క్రీన్లలో విడుదల చేయగా..తొలిరోజు 13.65 కోట్ల వసూళ్లు వచ్చాయి. స్టార్ హీరో చిత్రానికి ఇదొక రికార్డు. రెండో రోజు ఎనిమిది కోట్ల వసూళ్లు సాధించింది.
కలెక్షన్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి’ అన్నారు. యుగాలు, తరాలు మారినా రామ కథ గొప్పతనం అలాగే ఉంటుందని, భక్తిభావంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారని మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ సినిమాలో అన్ని పాటలను తానే రాశానని, చక్కటి భావోద్వేగాలతో సినిమా ఆకట్టుకుంటున్నదని గీత రచయిత రామజోగయ్యశాస్త్రి తెలిపారు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మట్లాడుతూ ‘రామనామాన్ని ప్రతీ గడపకు చేర్చాలనే ప్రయత్నంలో మేము సఫలీకృతులమయ్యాం. మూడు రోజులుగా వచ్చిన కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. మన పౌరాణిక పురుషుల గురించి ఈ తరం పిల్లలు తెలుసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు ఈ సినిమా చూశారు’ అన్నారు.