Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారంలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ భారీ విజయంతో పాటు కొన్ని వివాదాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలలో రణ్వీర్ సింగ్ తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు కనిపించడంతో సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.
ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. “వైరల్ అవుతున్న ఫోటోలు పూర్తిగా అసత్యం. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో మార్ఫింగ్ చేసి రూపొందించినవే. మా సినిమా అధికారిక స్టిల్స్‌ను కొందరు తప్పుడు ఉద్దేశంతో మార్చి ప్రచారం చేస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వెనుక సమాజంలో ఉద్రిక్తతలు రేపాలనే ఉద్దేశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐని ఉపయోగించి ఫోటోలు మార్చి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. అలాగే సిక్కు సమాజం పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని తెలిపారు. మా సినిమాలో ఎక్కడా తలపాగా ధరించిన పాత్ర సిగరెట్ తాగదు. ప్రతి సన్నివేశాన్ని బాధ్యతతో చిత్రీకరించాం.
ఇది మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని చేసిన దుష్ప్రచారం మాత్రమే” అని పేర్కొన్నారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రేక్షకులను ఆయన కోరారు. ఇక సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన ఆర్. మాధవన్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఓ సన్నివేశంలో ధూమపానం చేస్తూ పద్యాలు చెప్పాడని విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. ఆ సన్నివేశంలో తన పాత్ర ముందుగానే సిగరెట్ తాగడం ఆపేసిందని, మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఎక్కడా చిత్రీకరించలేదని వివరించారు. వివాదాలు కొనసాగుతున్నప్పటికీ ‘ధురంధర్ 2’ వసూళ్లలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. కరాచీ అండర్‌వరల్డ్ నేపథ్యంలో రణ్వీర్ సింగ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.