Adah Sharma | ప్రముఖ నటి అదా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హారర్ మూవీ ‘1920’ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదా, తన నటనతో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో పూరి జగన్నాథ్ – నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలోని ఆమె ప్రదర్శనకు మంచి ప్రశంసలు లభించాయి. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’, ‘కల్కి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించింది.
అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. తన అందం, గ్లామర్‌తో పాటు రిస్క్ ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో అదా ఎప్పుడూ ముందుంటుంది. అదే ధైర్యం ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ జీవితానికి నిజమైన టర్నింగ్ పాయింట్ అయింది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. రాజకీయ వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో అదా ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదా మాట్లాడుతూ..
“ది కేరళ స్టోరీ విడుదలైనప్పుడు సగం దేశం నన్ను చంపాలని అనుకుంది. కానీ మిగతా సగం దేశం నన్ను ప్రేమించి రక్షించింది. 1920 నుంచే నేను రిస్క్ ఉన్న రోల్స్ ఎంచుకుంటున్నాను. ఆ రిస్క్ వల్లే నేడు నాకు గుర్తింపు వచ్చింది. పాత్రలో భావోద్వేగం లేకపోతే నచ్చదు. యాక్షన్ సీన్లు ఉండాలి అని వెల్లడించింది.
ఇక ప్రస్తుతం అదా శర్మ, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివసించిన అదే ఫ్లాట్‌లో ఉంటోంది. ఆ ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫ్లాట్‌ను చాలా మంది అద్దెకు తీసుకోవడానికి భయపడ్డా, అదా మాత్రం ధైర్యంగా అక్కడే ఉంటోంది.ఇటీవల ఆమె ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమాలో శక్తివంతమైన పాత్రలో కనిపించింది. అదనంగా మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో కూడా అదా యాక్టివ్‌గా ఉంటూ, తన ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఫిట్నెస్ వీడియోలు, డాన్స్ క్లిప్స్, గ్లామరస్ ఫోటోషూట్లతో తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. సవాలు ఉన్న పాత్రలతోనే అదా శర్మ తనదైన ముద్ర వేసుకుంటూ బాలీవుడ్లో సత్తా చాటుతోంది.