భాషా హద్దులు లేకుండా పాదరసంలా పరుగులు పెడుతుంటారు నాయికలు. ఈ పరుగులో వాళ్ల వ్యక్తిగత జీవితాలకు దొరికే సమయం చాలా తక్కువ. వీలు చిక్కితే మాత్రం విదేశాలకు చెక్కేసి సేదతీరుతుంటారు. ఇలా వ్యవహరించే నాయికల్లో ఒకరు పూజా హెగ్డే. బాలీవుడ్ సహా దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటుందీ అందాల భామ.
ఆ మధ్య షూటింగ్ ల నుంచి గ్యాప్ దొరగ్గానే మాల్దీవులకు వెళ్లింది. అక్కడి బీచ్, ప్రకృతి అందాలకు తన అందాలను జోడించి ఓడ డెక్ ల మీద పరవశించింది. పొదుపుగా దుస్తులు వేసుకున్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి ప్రకృతిపై మళ్లీ మనసు పడిందో ఏమో..తాజాగా మరోసారి మాల్దీవుల టూర్ వెళ్లింది పూజా హెగ్డే. అయితే ఈసారి ఒంటరిగా కాదు..కుటుంబంతో. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాను ఇలా కుటుంబంతో పర్యాటక ప్రదేశానికి వచ్చానని సోషల్ మీడియా ద్వారా తెలిపిందీ నాయిక. అమ్మ పుట్టినరోజును అక్కడ జరుపుతానని చెబుతోంది.
పాండమిక్ లో సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. అందులో పూజా స్టార్ హీరోలతో నటించిన చిత్రాలున్నాయి. వాటిలో రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య, ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, విజయ్ కు జోడీగా నటించిన బీస్ట్ చిత్రాలున్నాయి. ఇవన్నీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు కొత్త ప్రాజెక్టులూ మొదలుపెడుతున్నదీ అగ్ర తార. మహేష్ బాబు తో త్రివిక్రమ్ రూపొందించనున్న చిత్రంలో నాయికగా ఎంపికైంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొంది.