‘రంగబలి’ చిత్రంలో మెడికల్ స్టూడెంట్‌గా కనిపిస్తా. నా పాత్ర పేరు సహజ .చాలా కూల్ క్యారెక్టర్. పేరుకు తగ్గట్టే చాలా సహజంగా వుండే అమ్మాయి. ఈ చిత్రం నటిగా నాకు మంచి పేరును తెచ్చిపెడుతుంది’ అన్నారు హీరోయిన్ యుక్తి తరేజ. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. నాగశౌర్య కథానాయకుడు. పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ తరేజ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘ఈ పాత్ర కోసం నన్ను అడిషన్ చేసి ఎంపిక చేశారు. ఇది నా మొదటి తెలుగు సినిమా. నా మొదటి సినిమాకే నాగశౌర్య గారితో పాటు మంచి నిర్మాణ సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తెలుగులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్. ఆయన డ్యాన్సంటే ఇష్టం. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని వుంది. కానీ ఆయన డ్యాన్స్ స్పీడ్‌ను మ్యాచ్ చేయడం కష్టం. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి అంటే ఇష్టం. ఇక ఈ సినిమా తరువాత నటించబోయే తదుపరి కథలు వింటున్నాను’ అన్నారు.