Vedhika Kumar | ‘శివకాశి’తో టాలీవుడ్‌ను పలకరించింది షోలాపూర్ చిన్నది.. వేదిక. ‘రూలర్’లో బాలయ్య సరసన ఆడిపాడి.. తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బాల్యంలోనే నటి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అందుకే, లండన్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేసినా.. ఇండస్ట్రీవైపే అడుగులేసింది. ముని, పరదేశి, కాంచన-3 చిత్రాలతో మంచినటిగా గుర్తింపు పొందిన వేదిక కుమార్ ముచ్చట్లు..
అమితాబ్ బచ్చన్, శ్రీదేవి నటన ఇష్టం. మణిరత్నం.. నా అభిమాన డైరెక్టర్! ఇండస్ట్రీలో ఒక్కొక్కరికీ ఒక్కో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. నాకు మాత్రం.. నేను చేస్తున్న చిత్రాలన్నీ నా డ్రీమ్ ప్రాజెక్టులే! ప్రతి పాత్రలో వైవిధ్యం ఉంది.
నటిగా ఎక్కువగా రోజులు కొనసాగాలంటే.. ఫిట్నెస్ కాపాడుకోవాల్సిందే! అందుకే రోజూ జిమ్ చేస్తా. యోగా కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నా.
నాజూకుగా ఉండాలని నోరు కట్టేసుకునే రకం కాదు నేను. భారతీయ వంటకాలను ఇష్టంగా తింటాను. బయటి దేశాలకు వెళ్లినప్పుడు..స్థానిక రుచులనూ ఆస్వాదిస్తా. ఇంకో విషయం.. నేను పక్కా వీగన్‌ను. మాంసాహారం కాదు కదా.. పాలు, పాలతో చేసిన పదార్థాలను కూడా ముట్టను.
నిజం చెప్పాలంటే.. నాకు చిన్నప్పటి నుంచే నటి కావాలని ఉండేది. పాఠశాల రోజుల్లో డ్యాన్స్ పోటీలు, నాటకాల్లో ఎక్కువగా పాల్గొనేదాన్ని. ప్రస్తుతం నా చేతిలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో తెలుగు వెబ్ సిరీస్ కూడా ఒకటి. అందులో టైటిల్ రోల్ నాదే! ఎంతో చాలెంజింగ్ పాత్ర అది. అందుకే, స్క్రిప్ట్ చూడగానే ఒప్పుకొన్నా.
నేను డబ్బు కోసమే సినిమాలు చేయడం లేదు. కీర్తి ప్రతిష్ఠలే నాకు ముఖ్యం. ఎప్పటికీ నిలిచి ఉండేది పేరే. పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం ఉండాలి, గుర్తింపు కావాలి.
ఏ రంగంలో రాణించాలన్నా.. కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. ఎదుటివారితో ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఒప్పిస్తున్నాం, ఎలా మెప్పిస్తున్నాం.. అన్నదానిపైనే.. మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఎవరిలో అయినా నేను చూసేది అదే!
నా జీవిత భాగస్వామిలో నేను ప్రధానంగా కోరుకునేది.. ప్రశాంతతనే. ఎప్పుడూ శాంతంగా ఉంటూ, అందర్నీ అభిమానంగా చూసుకుంటే చాలు. అయితే, అతను ఇంటెలిజెంట్ అయి ఉండాలి. నాలా వీగన్ కూడా అయి ఉండాలి. అలాంటి వ్యక్తినే ప్రేమిస్తా, పెండ్లాడతా. ఇదే ఫైనల్.
ప్రేమ అంటే ఏమిటో కచ్చితంగా నిర్వచించలేను. కానీ, ఈ సృష్టిలో అన్నిటికన్నా స్వచ్ఛమైంది మాత్రం.. అమ్మ ప్రేమే! ప్రతి ఒక్కరి జీవితంలో ‘ప్రేమ-కుటుంబం’ అనేవి అత్యంత ముఖ్యమైనవని నా భావన! అందుకే, ఫ్యామిలీతో గడిపేందుకే ఆసక్తి చూపుతాను.
డ్యాన్స్, యాక్టింగ్ ఎక్కువగా ఇష్టపడతాను! చిన్నప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటూ.. మాధురీ దీక్షిత్, శ్రీదేవి పాటలకు డ్యాన్స్ చేసేదాన్ని. నా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే మధుర జ్ఞాపకం అదే!
“Vedhika | సముద్రపు తీరాన హొయలు పోయిన వేదిక..”