Varalakshmi Sarathkumar | సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ అంటే కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది వరలక్ష్మీ శరత్‌కుమార్. పందెంకోడి, సర్కార్ వంటి తమిళ డబ్బింగ్ సినిమాల్లో విలన్‌గా మెప్పించినప్పటికీ.. క్రాక్ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో జయమ్మ పాత్రతో అందర్నీ మెప్పించింది. ఆ సినిమా సక్సెస్‌తో ఏకంగా బాలయ్యకే పోటీగా విలనిజం పండించింది. ఇప్పుడు కొండ్రల్ పావమ్ అనే తమిళ సినిమాతో వస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న వరలక్ష్మీ శరత్‌కుమార్.. రివ్యూయర్స్‌పై సీరియస్ అయ్యింది. సినిమాలకు రివ్యూ ఇవ్వాలంటే వాళ్లకు ఓ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలని సూచించింది.
‘ కొత్త సినిమాలు విడుదలవ్వగానే కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఇవి ఎక్కువ అయ్యాయి. సినిమా ట్రైలర్, టీజర్ చూసే వాళ్లకు అనిపించింది చెప్పేస్తున్నారు. అది బాగోలేదు.. ఇది బాగోలేదు అంటూ వాళ్లకు నచ్చింది చెప్పేస్తున్నారు. అర్థం పర్థం లేని రివ్యూలతో ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు.’ అని వరలక్ష్మీ శరత్ కుమార్ సీరియస్ అయ్యింది. అసలు రివ్యూలు ఇవ్వడానికి వాళ్లెవరూ అంటూ ప్రశ్నించింది. రివ్యూ ఇచ్చే వాళ్లందర్నీ నేను అడిగేది ఒక్కటే.. అసలు సినిమా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అని నిలదీసింది.
మొదట్లో సినిమాలను వినోదం కోసం చూసేవాళ్లని.. ఇప్పుడు ఎంజాయ్ చేయడం మానేసి నెగెటివ్ కామెంట్స్ చేయడానికి చూస్తున్నారని వరలక్ష్మీ శరత్‌కుమార్ అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో ఈ నెగెటివ్ కామెంట్స్ మరీ ఎక్కువయ్యాయని ఆమె పేర్కొంది. సినిమా హిట్టా? ఫట్టా? బాగుందా? బాగోలేదా? అనేది ప్రేక్షకులను నిర్ణయించుకోనివ్వండని సూచించింది. మీకు అంతగా రివ్యూలు ఇవ్వాలని అనిపిస్తే సినిమా విడుదలైన ఐదారు రోజుల తర్వాత రివ్యూలు ఇవ్వండి అని చెప్పింది. ప్రేక్షకులను సినిమా చూసి ఆనందించే అవకాశం ఇవ్వండని.. ఇదొక్కటే తన విన్నపమని తెలిపింది.