Actress Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తరచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబై బాంద్రాలోని తన పాపులర్ రెస్టారెంట్ అయిన ‘బాస్టియన్’ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ముంబైలో ఎంతో పాపులర్ అయిన బాస్టియన్‌కు వీడ్కోలు పలుకుతున్నాం. ఈ గురువారం బాస్టియన్ బాంద్రాకు చివరిరోజు. ఇది ముంబైలోని ఐకానిక్ డెస్టినేషన్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మర్చిపోలేని రాత్రులు, నగర నైట్‌లైఫ్‌ను మార్చిన క్షణాలను ఇది మాకు ఇచ్చిందంటూ శిల్పా రాసుకోచ్చింది. అయితే శిల్పా ఈ రెస్టారెంట్‌ను మూసివేయడానికి గల కారణాన్ని వెల్లడించలేదు. తనపై తన భర్తపై నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసు నేపథ్యంలో శిల్పా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక వ్యాపారవేత్తను పెట్టుబడి పేరుతో మోసం చేశారని ఈ దంపతులపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ రెస్టారెంట్ బ్రాండ్‌ను పూర్తిగా మూసివేయడం లేదని, బాంద్రాలోని అవుట్లెట్ మాత్రమే మూసివేస్తున్నారని తెలుస్తోంది. శిల్పాశెట్టి మరో రెస్టారెంట్ అయిన ‘బాస్టియన్ ఎట్ ది టాప్’ యథావిధిగా కొనసాగుతుందని కూడా శిల్పాశెట్టి తెలిపారు. ఇక ‘బాస్టియన్’ రెస్టారెంట్ విషయానికి వస్తే.. శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రంజిత్ బింద్రా పార్ట్నర్షిప్తో ఇది 2016లో ప్రారంభమైంది.