Sonakshi Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్న కొన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అనుమతి లేకుండా తన ఫొటోలను వాడటం సరికాదని హెచ్చరించారు. వెంటనే వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె తేల్చి చెప్పారు. “నేను తరచూ ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. ఇటీవల కొన్ని బ్రాండెడ్ వెబ్సైట్లలో నా ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాను. ఎలాంటి అనుమతి లేకుండా, కనీసం అడగకుండానే నా ఫొటోలని వాడటం ఏ మాత్రం నైతికం కాదు.
ఒక నటిగా నేను తరచూ కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తాను. అలా ధరించినప్పుడు వాటి బ్రాండ్ వివరాలు జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను. అయితే నేను ఒక డ్రెస్‌కు క్రెడిట్ ఇచ్చానని చెప్పి నా చిత్రాలను మీ వెబ్సైట్లో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడితే అస్సలు ఒప్పుకోను. వెంటనే నా ఫొటోలు తొలగించండి, లేదంటే కఠిన చర్యలు తప్పవు,” అని ఆమె తన సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. సోనాక్షి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో కొందరు మద్దతు తెలుపుతున్నారు. బహిరంగ ప్రొఫైల్ ఉన్న సెలెబ్రిటీ అయినప్పటికీ, వారి వ్యక్తిగత ఫోటోలను వ్యాపార ప్రయోజనాల కోసం వాడటం సరికాదన్న సందేశం ఆమె ధీటుగా ఇచ్చారు.
సోనాక్షి సిన్హా ఇటీవల ‘నికితా రాయ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని ఆమె సోదరుడు ఖుష్ ఎన్ సిన్హా తెరకెక్కించారు.చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేశ్ రావల్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.గత సంవత్సరం ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో ప్రేక్షకులను అలరించింది సోనాక్షి సిన్హా.