OpenAI | కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల మానసిక స్థితిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని వస్తున్న వాదనల నేపథ్యంలో.. తమ చాట్‌జీపీటీలో పేరెంటింగ్ కంట్రోల్స్‌ను చేర్చాలని నిర్ణయించింది. అమెరికాలో 16 ఏళ్ల టీనేజర్ ఆత్మహత్యకు చాట్‌జీపీటీ కారణమని ఆ కుర్రాడి తల్లిదండ్రులు కోర్టు మెట్లు ఎక్కిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ పేరెంటింగ్ కంట్రోల్ ఫీచర్ ద్వారా తమ టీనేజ్ పిల్లలు ( 13 ఏండ్ల లోపు) వారి అకౌంట్లను తమ అకౌంట్‌కు లింక్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ మెయిల్ ఇన్విటేషన్ ద్వారా అయిపోతుంది. ఈ కంట్రోల్స్ ద్వారా పిల్లల అకౌంట్లోని మెమొరీ, చాట్ హిస్టరీని తల్లిదండ్రులు డిసేబుల్ చేయవచ్చు. తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు చాట్‌జీపీటీ చెబుతున్న సమాధానాలను నియంత్రించే సదుపాయం కూడా కల్పించింది. దీనిద్వారా తమ వయసుకు తగినట్లుగా చాట్‌జీపీటీ సలహాలు ఇవ్వనుంది. ముఖ్యంగా పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తించిన వెంటనే వారి తల్లిదండ్రులకు ఒక నోటిఫికేషన్ పంపించి అలర్ట్ చేయనుంది. ఈ సదుపాయం ద్వారా పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని మరింత పెంచుతుందని ఓపెన్ఏఐ అభిప్రాయపడింది. ఈ మార్పులను వచ్చే నెలలోనే అందుబాటులోకి తీసుకోస్తామని ప్రకటించింది.
ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఓపెన్ఏఐ తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లో మరింత ముందుకెళ్తామని ప్రకటించింది. ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ, తమను తాము మరింత శక్తివంతంగా మార్చుకుంటామని పేర్కొంది. నిపుణుల సలహాలు తీసుకుంటూ ప్రజలకు వీలైనంత ఉపయోగకరంగా ఉండేలా తమను మలచుకుంటామని చెప్పింది. అమెరికాకు చెందిన ఓ టీనేజర్ ఆడమ్ రైన్ ఆత్మహత్యలో చాట్‌జీపీటీ పాత్ర ఉందని అతని తల్లిదండ్రులు దావా వేసిన నేపథ్యంలో ఓపెన్ఏఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మాథ్యూ, మరియా రైన్ దంపతులు ఇటీవల ఓపెన్ఏఐ మీద దావా వేశారు. అందులో తమ 16 ఏళ్ల కుమారుడు ఆడమ్ రైన్ ఆత్మహత్యలో చాట్‌జీపీటీ పాత్ర ఉందని ఆరోపించారు. అది తమ కుమారుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించడమే కాకుండా స్వీయ హాని పద్ధతులు, సూసైడ్ నోట్ తయారు చేసుకోవడంలో సాయం చేసిందని పేర్కొన్నారు. పైగా ఈ ప్రయత్నాలను తల్లిదండ్రులకు తెలియకుండా సలహా కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. ఇకనైనా చాట్‌జీపీటీలో స్వీయహాని పద్ధతుల కోసం వెతికినప్పుడు అటువంటి సమాచారాన్ని అందివ్వకుండా చర్యలు తీసుకోవాలని దావాలో కోరారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ పేరెంటింగ్ కంట్రోల్‌ను తీసుకురావాలని నిర్ణయించింది.