Actress Sai Pallavi : తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో నటి సాయిపల్లవికి మంచి గుర్తింపు ఉంది. సహజ సుందరిగా ఆమె గొప్ప ఫేమ్‌ను సొంతం చేసుకుంది. సాయిపల్లి నటించడం మాత్రమే కాదు, డ్యాన్సింగ్ కూడా అద్భుతంగా చేస్తుంది. పైగా ఆమె ఎలాంటి బోల్డ్ రోల్స్ చేయకపోయినా సాధారణ పాత్రలు పోషిస్తూనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలో సాయిపల్లవి మీడియా నుంచి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఓ మీడియా సంస్థ ఆమె చేయని తప్పును చేసినట్లుగా ప్రచురించింది. దాంతో ఆమె తాను ఆ తప్పు చేయలేదంటూ కన్నీటి పర్యంతం కావాల్సి వచ్చింది.
ఇటీవలే సాయిపల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు సంబంధించిన రియల్ స్టోరీ ‘అమరన్’ లో నటించింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇంతకంటే ముఖ్యంగా సాయిపల్లవి నాగచైతన్యతో కలిసి నటించిన ‘తండేల్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఎమోషనల్ అయ్యింది.
‘అప్పటికి ఇంకా ప్రెస్ మీట్ మొదలు కాలేదు. కెమెరాలు ఆన్ చేయలేదు. ‘మలయాళం నటులంతా ఎలా తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నారు..?’ అని ఓ రిపోర్టర్ నన్ను అడిగాడు. దాంతో నేను మలయాళీని కాదు, మాది తమిళనాడు అని చెప్పాను. మరుసటి రోజు ఆ రిపోర్టర్ ‘మలయాళీ అన్నందుకు రిపోర్టర్లపైన సీరియస్ అయిన సాయిపల్లవి’ అని వార్త రాశాడు. ఆ వార్త నన్ను చాలా బాధించింది’ అని సాయిపల్లవి చెప్పారు.
ఆ వార్త ప్రచురితమైన తర్వాత రోజు చోటుచేసుకున్న ఓ ఘటన గురించి చెబుతూ సాయిపల్లి భావోద్వేగానికి లోనయ్యారు. ‘వార్త ప్రచురితమైన మరుసటి రోజు ఎయిర్‌పోర్టులో నేను ఒక మహిళతో మాట్లాడాను. ఆమె మలయాళంలో మాట్లాడుతూ.. ‘నేను మలయాళంలో మాట్లాడుతున్నందుకు నాపై కోప్పడకు. ఎందుకంటే నేను కేరళకు చెందిన వ్యక్తిని’ అన్నది. ఆమె మాటలు వినగానే నాకు చాలా బాధేసింది’ అంటూ సాయిపల్లవి భావోద్వేగానికి లోనై ఏడ్చింది.
తాను చేయని తప్పుకు మానసికంగా వేదన అనుభవించాల్సి వచ్చిందని చెప్పింది. అయితే ఈ విషయం సినిమా ప్రేక్షకులకు అర్థమైందని ఆమె పేర్కొన్నది.