Jacqueline Fernandes | రూ. 200 కోట్ల భారీ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తాను ‘అప్రూవర్’గా మారతానంటూ గతంలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఆమె తాజాగా ఉపసంహరించుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు ప్రకటించాడు.
నిందితుడు సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న ఈ కేసులో జాక్వెలిన్ అప్రూవర్‌గా మారేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మొదటి నుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆమె కేవలం బాధితురాలు మాత్రమే కాదని, నేరపూరిత మార్గాల్లో వచ్చిన ఆదాయం ద్వారా భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందిన నిందితురాలు అని ఈడీ కోర్టుకు విన్నవించింది. అయితే సుకేష్ నేర చరిత్ర తెలిసినప్పటికీ ఆమె అతని నుంచి ఖరీదైన బహుమతులు, నగలు అందుకున్నారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఈ క్రమంలో కోర్టులో ప్రతికూల పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉండటంతో జాక్వెలిన్ తన దరఖాస్తును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. నటి విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ కేసును డిస్పోజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఛార్జీలపై వాదనల దశలో ఉండగా, జాక్వెలిన్ తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.