నాయికల విషయంలో వయసు పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నది నాయిక భానుశ్రీ మెహ్రా. వయసు, పెళ్లి కారణం చూపుతూ…తమను హీరోయిన్ పాత్రలకు దూరం చేస్తున్నారని బాధపడిందీ తార. ‘వరుడు’ సినిమాతో భానుశ్రీ మెహ్రా తెలుగు తెరకు పరిచయమైంది. 2010లో పెళ్లి నేపథ్య చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అపజయం పాలవడంతో ఈ నాయికకు అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కొన్ని సినిమాలు చేసినా ఆమెకు ఇండస్ట్రీలో బ్రేక్ రాలేదు. ఇటీవల ఈ నాయిక స్పందిస్తూ…‘వయసు విషయంలో హీరో, హీరోయిన్ల మధ్య చాలా వివక్ష చూపిస్తుంటారు.
చిత్ర పరిశ్రమలో మాకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే. హీరోలు ఎంత వయసొచ్చినా ప్రేమ కథా చిత్రాల్లో నటిస్తుంటారు. తమ వయసులో సగం కూడా లేని హీరోయిన్లకు ప్రేమికుడిగా నటిస్తారు. కానీ ఐదారేండ్లు ఇండస్ట్రీలో ఉన్న నాయికలకు వివాహమైతే తల్లి పాత్రలకు మాత్రమే అడుగుతుంటారు. ఈ మూస ధోరణి కొనసాగకూడదు. సాహసం గల మహిళల నేపథ్యంతో సినిమాలు తెరకెక్కాలి’ అని పేర్కొంది.