తెలుగు సినిమా స్వర్ణయుగం నాటి ఆనవాళ్లు ఒక్కొక్కటీ చెరిగిపోతున్నాయి. కోట శ్రీనివాసరావు మరణానికి చెందిన విషాద ఛాయలు ఇంకా సమసిపోకముందే మరో నట శిఖరం నేలకొరిగింది. మహానటి పద్మభూషణ్ బి.సరోజాదేవి(87) కాలం చేశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, నట దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్, రాజ్‌కుమార్‌లకు ధీటైన జోడీగా కొన్నేళ్లపాటు దక్షిణభారత సినిమాను శాసించారు బి.సరోజాదేవి. 1938లో కర్ణాటకలో జన్మించిన ఆమె, 13ఏండ్ల చిరుప్రాయంలోనే నటిగా తెరంగేట్రం చేశారు.
నటిగా ఆమె తొలి సినిమా ‘మహాకవి కాళిదాస’(1955). హొన్నప్ప భాగవతార్ కథానాయకుడిగా రూపొందిన ఈ కన్నడ సినిమా బి.సరోజాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత రెండేళ్లలోనే వరుసగా ఆరు కన్నడ సినిమాల్లో నటించారు బి.సరోజా. ఎన్టీఆర్ నటించి, నిర్మించిన ‘పాండురంగమహత్మ్యం’(1957) తెలుగులో ఆమె తొలి చిత్రం. ఈ సినిమాలో ఆమె వ్యాంప్ తరహా పాత్రను పోషించినా.. పేరు ప్రఖ్యాతులు మాత్రం హీరోయిన్ స్థాయిలో వచ్చాయి. తర్వాత కాలంలో తెలుగులో ఎన్టీఆర్‌కి, తమిళంలో ఎమ్జీఆర్‌కి హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు బి.సరోజాదేవి.
ఎన్టీఆర్‌తో ఆమె నటించిన సీతారామకల్యాణం(1961), జగదేక వీరునికథ(1961), దాగుడుమూతలు(1964), శకుంతల(1966), భాగ్యచక్రం(1968), ఉమా చండీ గౌరీ శంకరులకథ(1968), విజయం మనదే(1970), మాయని మమత(1970), శ్రీరామాంజనేయయుద్ధం (1975)దానవీరశూరకర్ణ(1977) చిత్రాలు నేటికీ సినీప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్‌ని ఆజన్మాంతం గురువుగానే భావించారు బి.సరోజా.
ఎన్టీఆర్ ‘జగదేకవీరునికథ’లో ఇంద్రకుమారి జయంతిగా బి.సరోజాదేవి ఒలికించిన అభినయం.. ప్రేక్షకులకు ఓ మధుర జ్ఞాపకం. ‘ఓ.. హలా వారుణీ.. ఓ హలా నాగినీ.. ఓ హలా మరియచీ.. పకపకలు చాలించీ.. చకచకా రారమ్మా జలక్రీడలకూ..’ అంటూ ముద్దుముద్దుగా బి.సరోజా పలికిన సంభాషణలు అప్పటి యువతరాన్ని తన్మయానికి గురిచేశాయి. ఈ సినిమాలో బి.సరోజ పోషించిన జయంతి పాత్రే.. చిరంజీవి ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవి పోషించిన ఇంద్రజ పాత్రకు ప్రేరణ. ‘మానవా.. ఒక్కసారి ఇటు చూడవా..’ అంటూ అందులో బి.సరోజా పలికిన తీరునే ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ సినిమాలో శ్రీదేవి కూడా అనుసరించింది. ఆ విధంగా ఎందరో కథానాయికలకు బి.సరోజాదేవి ఆదర్శంగా నిలిచారు. అక్కినేనితో కూడా పెళ్లికానుక, శ్రీకృష్ణార్జునయుద్ధం, ఆత్మబలం చిత్రాల్లో జతకట్టారు బి.సరోజా. ముఖ్యంగా ‘ఆత్మబలం’లో అక్కినేనితో కలిసి ఆమె అభినయించిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే..’ పాట వానపాటలకు ట్రెండ్ సెట్టర్.
1955 నుంచి 1984 వరకూ 29 ఏండ్లలో వరుసగా 161 చిత్రాల్లో లీడ్‌రోల్స్ చేసిన రికార్డ్ బి.సరోజాదేవి సొంతం. అలాగే.. ఎన్టీఆర్ రాముడిగా నటించిన ‘శ్రీరామాంజనేయయుద్ధం’లో సీతగా నటించిన బి.సరోజాదేవి.. ఎన్టీఆర్ రావణుడిగా నటించిన ‘సీతారామకల్యాణం’లో మండోదరిగా మెప్పించారు. ఇది ఆమెకు మాత్రమే దక్కిన ప్రత్యేకత.
తెలుగు, తమిళ, కన్నడ హిందీ భాషల్లో 200లకు పైగా సినిమాల్లో నటించిన బి.సరోజాదేవి, భారతీయ సినిమాకు అందించిన సేవలకు గాను.. 1969లో ‘పద్మశ్రీ’, 1992లో ‘పద్మభూషణ్’ పురస్కారాలతో కేంద్రప్రభుత్వం గౌరవించింది. 2005లో వచ్చిన ‘దేవీ అభయం’ తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా. బి.సరోజాదేవి మరణంతో దక్షిణాది సినిమారంగం దిగ్భ్రాంతికి లోనైంది. ఓ శకం ముగిసిందంటూ.. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.