Anshu | ‘మన్మథుడు’ టైమ్‌కి నా వయసు 15ఏళ్లు. అప్పటికి అంత మెచ్యూరిటీ లేదునాకు. ‘మన్మథుడు’ నా పాతికేళ్ల వయసులో చేసివుంటే.. బహుశా సినిమాల్లోనే కొనసాగేదాన్నేమో.. ‘రాఘవేంద్ర’ తర్వాత లండన్ వెళ్లిపోయి అక్కడే మాస్టర్స్ పూర్తి చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. 24ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. బ్యూటిఫుల్ జర్నీ’ అని తన గురించి చెప్పుకొచ్చింది కథానాయిక అన్షు. మన్మథుడు, రాఘవేంద్ర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందం.. దాదాపు 23ఏండ్ల విరామం తర్వాత ‘మజాకా’ చిత్రం ద్వారా తెరపై సాక్షాత్కరించనుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో అన్షు విలేకరులతో ముచ్చటించింది. ‘మజాకా’ తనకు గొప్ప అవకాశమని, రైటర్ ప్రసన్న కథ చెబుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశానని, కథలో తనది చాలా కీలకమైన హెవీ రోల్ అని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని అన్షు నమ్మకం వెలిబుచ్చారు. ‘నేను బ్రిటిష్ ఇండియన్. లండన్‌లోనే ఉంటున్నాను. అందుకే తెలుగు కాస్త కష్టమైంది. ఓ ట్యూటర్ని పెట్టుకొని తెలుగు నేర్చుకుంటున్నా. చిత్ర యూనిట్ కూడా ఈ విషయంలో నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. సందీప్‌కిషన్, రీతూవర్మ అయితే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్యూచర్లో తెలుగులో మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఉంది.’ అని తెలిపింది అన్షు.