విశ్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్ రచనలో విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మే 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘సినిమా ప్రచారంలో భాగంగా మేము చేసిన ప్రాంక్ వీడియో ఇంత వివాదం అవుతుందని అనుకోలేదు. నేను వివాదాలు కోరుకోవడం లేదు. నా ప్రతి సినిమాకు మంచి ప్రచారం చేయాలని ప్రయత్నిస్తుంటా. ఈ క్రమంలో అనుకోకుండా జరిగిన తప్పు అని అనుకుంటున్నా. బాధలో తెలియకుండా మనం కొన్ని పదాలు పలుకుతుంటాం. అలా టీవీ డిబేట్లో ఒక మాట నోరు జారాను.
ఈ వివాదంలో కావాలని చేసినదేమీ లేదు. ఈ సినిమా కోసం చాలా ఊర్లు తిరిగాం, కాలేజీలకు వెళ్లి ప్రమోషన్ చేశాం. పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకర సినిమా ఇది. భావోద్వేగాలూ ఉంటాయి. కుటుంబ ప్రేక్షకులు కలిసి చూడొచ్చు. నా తరహా సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది’ అన్నారు. నాయిక రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో మాధవి అనే పాత్రలో నటించాను. నా క్యారెక్టర్‌ను కుటుంబ ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ఇంట్లో అమ్మాయి పెళ్లి జరిగేప్పుడు ఎలాంటి ఉద్వేగాలకు లోనవుతారో తెరపై చూస్తారు’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో రచయిత రవి కిరణ్, దర్శకుడు విద్యాసాగర్ చింతా, నిర్మాత బాపినీడు, సుధీర్ ఈదర తదితరులు పాల్గొన్నారు.