Vijay Devarakonda – Kingdom | విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రం శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా శ్రీలంకలోనే జరుపుకుంది. అలాగే ఈ చిత్రం స్పై జానర్లో రాబోతుండడంతో ఇందులో LTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం)కి సంబంధించిన ప్రస్తావన ఉండబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ఎల్టీటీఈ ప్రస్తావన ఉండదని తెలిపాడు. కానీ అలాంటి టైమ్‌లైన్‌లో జరిగిన కథగా ఈ సినిమా రాబోతుందని విజయ్ తెలిపాడు.
LTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం) అనే సంస్థను శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని పతనం ఆ దళ నాయకుడు వెలుపిళ్లై ప్రభాకరన్ మరణంతో 2009లో ముగిసింది.
అసలు వివాదం ఏంటంటే.. 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చాక, సింహళీయుల ప్రభుత్వాలు తమిళుల పట్ల వివక్ష చూపడం ప్రారంభించాయి. సింహళాన్ని అధికార భాషగా చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళులకు తక్కువ అవకాశాలు కల్పించడం వంటి చర్యలు శ్రీలంకలో ఉన్న తమిళ ప్రజలలో అసంతృప్తిని పెంచాయి. దీని ఫలితంగా, 1976లో వెలుపిళ్లై ప్రభాకరన్ LTTE స్థాపించాడు. గెరిల్లా యుద్ధం ద్వారా ప్రారంభమైన ఈ సంస్థ, కొద్దిరోజుల్లోనే నౌకాదళం, వైమానిక దళం, ఆత్మాహుతి దళాలు(Suscide Bombers) వంటి విభాగాలతో ఒక శక్తివంతమైన సైనిక సంస్థగా రూపాంతరం చెందింది. ఈ సంస్థ చర్యల కారణంగానే భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. దీంతో 2000 దశకం మధ్యలో శ్రీలంక ప్రభుత్వం LTTEపై పూర్తిస్థాయి సైనిక చర్య చేపట్టింది. 2009 మే నెలలో, శ్రీలంక సైన్యం LTTE నాయకుడు ప్రభాకరన్‌ను హతమార్చడంతో ఆ సంస్థ పూర్తిగా పతనమైంది. దీంతో దాదాపు మూడున్నర దశాబ్దాల అంతర్యుద్ధం(Srilanka Civil War) ముగిసింది. ప్రపంచంలోని చాలా దేశాలు LTTEని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.