Thalapathy Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో, తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా, వచ్చే మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. తన రాజకీయ అరంగేట్రం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలని కోరుకుంటూ ఆయన ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. విజయ్ రాకతో ఆలయ ప్రాంగణం మరియు మదురై విమానాశ్రయం వద్ద అభిమానులు భారీగా తరలివచ్చి కోలాహలం సృష్టించారు. కాగా, రాజకీయ బిజీలో ఉన్న విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ కూడా మే 8న విడుదలకు కాబోతుందని వార్తలు వస్తుండటంతో అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో విజయ్ తదుపరి అడుగుల కోసం యావత్ తమిళనాడు ఎదురుచూస్తోంది.