Indian Railways | ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. అయితే ఈ ప్రయాణంలో రైలు లగ్జరీ సౌకర్యాలను చూసిన ఆయన, ఒక్కసారిగా తన పాత రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఒకప్పుడు నటుడు అవ్వాలనే కలతో ముంబైలో తను పడ్డ కష్టాలు, రైలు ప్రయాణాల అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. భారతీయ రైల్వే సాధించిన ప్రగతి అద్భుతంగా ఉందంటూ సోనూ సూద్ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు.
నేను ప్రస్తుతం వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్నాను. మన దేశంలో రైల్వేలు ఇంతగా అభివృద్ధి చెందడం నిజంగా గర్వకారణం. ఇక్కడి వసతులు, ఇస్తున్న ఫుడ్, సిబ్బంది ప్రవర్తన, వారు చూపిస్తున్న ప్రేమ అన్నీ చాలా బాగున్నాయి. ఈ ప్రయాణం నా మొదటి రైలు ప్రయాణాన్ని గుర్తుకు తెచ్చింది. నేను నాగ్‌పూర్‌లో చదువు పూర్తి చేసుకుని, నటుడిని అవ్వాలనే పెద్ద కలతో ముంబైకి బయలుదేరిన రోజులు గుర్తొచ్చాయి అని చెప్పారు.
ఆ రోజుల్లో ప్రయాణించడానికి మాకు కనీసం రైలు రిజర్వేషన్ కూడా దొరికేది కాదు. పొడవాటి కంప్యూటర్ పేపర్లను మడతపెట్టుకుని ఎలాగోలా జనరల్ బోగీల్లోకి దూరేవాళ్లం. రాత్రి పూట పడుకోవడానికి చోటు లేక, రైలు టాయిలెట్ దగ్గరే నేలపై పేపర్లు పరుచుకుని పడుకునేవాళ్లం. అలాంటిది, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రైలెక్కితే వ్యవస్థ మొత్తం మారిపోయింది. భారతీయ రైల్వే క్వాలిటీ ఎంతో పెరిగింది. ఇప్పుడు ఎవరూ టాయిలెట్ దగ్గర పేపర్లు వేసుకుని పడుకోవాల్సిన అవసరం లేదు. సామాన్యుల ప్రయాణాన్ని ఇంత సుఖవంతం చేసినందుకు, మన దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు రైల్వే శాఖకు నా ధన్యవాదాలు. ఇలాంటి మంచి పనులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అని సోనూ సూద్ కొనియాడారు.
Thank you, Indian Railways, for upgrading the everyday journey and quality of life of millions of common Indians. 🇮🇳🚆@RailMinIndia pic.twitter.com/w0yTXkO9Ja
— sonu sood (@SonuSood) June 13, 2026