శంకర్ సినిమాలంటే భారీతనానికి, సామాజిక సందేశాలకు పెట్టింది పేరు. 90దశకంలోనే దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినీ రంగంలో విమర్శలు సాధారణమేనని, వాటిని సవాలుగా తీసుకొని తదుపరి సినిమాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని శంకర్ అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో బయోపిక్ సినిమా తీయాల్సివస్తే తాను రజనీకాంత్ జీవిత చరిత్రను వెండితెర దృశ్యమానం చేస్తానని ఆయన చెప్పారు. ‘నాకు ప్రస్తుతానికైతే బయోపిక్ తీయాలనే ఆలోచన లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే రజనీకాంత్ జీవిత చరిత్రనే తీస్తాను. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం’ అని శంకర్ తెలిపారు. ‘గేమ్ చేంజర్’ విడుదలైన తర్వాత ‘భారతీయుడు-3’ సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెడతానని ఆయన వెల్లడించారు.