Laggam Movie | ‘తెలంగాణ నేపథ్యంలో బలమైన కథ చెప్పాలని ఈ సినిమా తీశాను. నిర్మాతల సహకారంతో అనుకున్న విధంగా తెరకెక్కించాం. అరిటాకులో వడ్డించిన విందు భోజనంలా ఉంటుందీ చిత్రం’ అన్నారు రమేష్ చెప్పాల. ఆయన దర్శకత్వంలో సాయిరోనక్, ప్రగ్యా నాగ్ర జంటగా నటించిన ‘లగ్గం’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘తండ్రీకూతుళ్ల కథ ఇది. దర్శకుడు రమేష్ చెప్పాలతో ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రం నుంచి అనుబంధం ఉంది. ఆ చిత్రానికి ఆయన రచయితగా పనిచేశారు. ఈ సినిమాలో తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్టం’ అన్నారు. ఈ కథ విన్నప్పుడు కొన్నిసార్లు తన కళ్లు చెమ్మగిల్లాయని, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుందని నటి రోహిణి చెప్పారు. ఈ సినిమా ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు అందమైన సందేశాన్ని అందించామని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.