Nassar | ప్రముఖ సినీ నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన రాణిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో నటిస్తూ ఫుల్బిజీగా ఉన్నారు. విలన్‌గా, తండ్రిగా తదితర విభిన్న పాత్రలు పోషించిన ఆయన.. ఎంతో గుర్తింపును సాధించారు. అయితే, ఆయన ఓసారి కుంగిపోయారు. ఇందుకు ప్రధాన కారణం కొడుకు జరిగిన ప్రమాదమే. కొద్దిరోజుల కిందట నాజర్ కొడుకుకు ప్రమాదంలో కోమాలోకి వెళ్లాడని.. తన కొడుకు కోలుకునేందుకు హీరో విజయ్ కారణమని ఆయన చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాజర్.. కీలక విషయాలు వెల్లడించారు. తన కొడుకుకు యాక్సిడెంట్ జరిగిందని.. 14 రోజుల పాటు కోమాలోనే ఉన్నాడని.. ఆ సమయంలో డాక్టర్లు ఏం చెబుతారోనని తాను చాలా ఆందోళనకు గురయ్యానన్నారు. ఆ సమయంలో తన పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని కోరుకున్నానని.. ఆ రోజులు గుర్తుకు వస్తే తనకు ఇప్పటికీ భయంగానే ఉంటుందని చెప్పారు.
తన కొడుకు కోలుకునేందుకు హీరో విజయ్ అనే కారణమని.. ఈ విషయాన్ని తాను బలంగా నమ్ముతానన్నారు. తన కొడుకు కోమాలో నుంచి వచ్చాడని తెలిసి సంతోషించామని.. అయితే, తమ గురించి అడుగుతాడనుకుంటే.. హీరో విజయ్ గురించి అడిగాడని చెప్పారు. విజయ్ అంటే అతనికి పిచ్చి అని.. ఆ విషయంలో తెలియగానే వైద్యులు విజయ్ సినిమాలు, పాటలు చూపిస్తూ వైద్యం చేశారని తెలిపాడు. అప్పటి నుంచి మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టాడని పేర్కొన్నారు. ఈ విషయం హీరో విజయ్‌కి తెలిసిందని.. ఆ తర్వాత ఆయన నేరుగా ఆసుపత్రికి వచ్చి తన తనయుడిని పరామర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. ఆయన వల్లే తన కొడుకు కోలుకున్నాడని తాను నమ్ముతున్నానని.. ఆ తర్వాత హీరో విజయ్, తన కొడుకు మంచి స్నేహితులయ్యారని వివరించారు నాజర్.