Narvini Dery | తమిళ నటుడు అజ్మల్ అమీర్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తనపై వచ్చిన ఆరోపణలను అజ్మల్ ఖండించారు. తన కెరీర్‌ను దెబ్బతీసేందుకు రూపొందించిన ఏఐ ఫేక్ వీడియో అని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం సద్దుమణుగుతుందనుకుంటున్న సమయంలోనే.. తాజాగా తమిళ నటి నర్విని దేరి అజ్మల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ‘అజ్మల్ అలాంటి వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యానించింది. నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నటి నర్విని దేరి మాట్లాడుతూ 2018లో చెన్నైలోని ఓ మాల్లో అజ్మల్‌ను మొదటిసారి కలిశానని చెప్పింది. ఆ సమయంలో తన సినిమాలో హీరోయిన్ కోసం చూస్తున్నానని చెప్పి తన మొబైల్ నంబర్ తీసుకున్నాడని.. ఆ తర్వాత ఆడిషన్‌కు రమ్మని పిలిచాడని, డెన్మార్క్ వెళ్లాల్సి ఉందని చెప్పినా ఒప్పించి రమ్మన్నాడని తెలిపింది. అక్కడికి వెళ్లాక వాతావరణం అంగీకరించలేని విధంగా అనిపించిందని.. రూమ్‌లో అజ్మల్ మాత్రమే ఉన్నాడని.. మిగతా వాళ్లెవరూ లేరా? అని అడిగితే ‘బయటకు వెళ్లిపోయారు’ అని చెప్పాడని.. ఆ సమయంలో తనకు ఏదో తప్పు జరగబోతోందని అర్థమైంది అని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లడుతూ.. మాటల సమయంలోనే తన చేయి పట్టుకుని డ్యాన్స్ చేయమని అజ్మల్ అడిగాడని, తాను తిరస్కరించానని పేర్కొంది. మీ ఉద్దేశం నాకు అర్థమైంది.. తాను దాని కోసం ఇక్కడకు రాలేదంటూ చెప్పానని.. ఏమాత్రం వినకుండా తన వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడతారంటూ అహంకారంగా మాట్లాడడని చెప్పుకొచ్చింది.
అదృష్టవశాత్తు అతనికి ఫోన్ కాల్ రావడంతో తాను అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డానని వివరించింది. అయితే, ఆ సమయంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించగా.. ఆ సమయంలో తాను చదువు, కెరియర్‌పైనే దృష్టి పెట్టానని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పింది. ప్రస్తుతం అతని నిజస్వరూపం అందరికీ తెలిసిందని.. తనకు జరిగినట్లుగా మరో అమ్మాయికి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని విషయాలను బయటపెడుతున్నానని నర్వీ తెలిపింది. ప్రస్తుతం, ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై అజ్మల్ స్పందించలేదు.