Chiranjeevi | ఈ గిన్నిస్ రికార్డు నేను ఊహించింది కాదు. డ్యాన్స్‌పై నాకున్న ఆసక్తే ఈ అవార్డును నాకు దక్కేలా చేసిందని భావిస్తున్నా. తొలినాళ్లలో నటనకంటే డ్యాన్స్‌నే ఎక్కువ ఇష్టపడేవాడ్ని. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తుండేవాడ్ని. ఎన్సీసీలో చేరాక కూడా భోజనం పూర్తయ్యాక ప్లేట్‌తో డప్పు కొడుతూ స్టెప్పులేసేవాడ్ని. నటుడిగా తొలి అడుగులు పడుతున్న రోజుల్లో డ్యాన్స్ చేస్తూ కాలు జారి కిందపడిపోయాను. అప్పుడు లొకేషన్లో ఉన్న సావిత్రిగారు, నరసింహరాజు, రోజారమణి నన్ను చూసి ‘అయ్యో’ అంటూ జాలి పడుతుంటే.. కిందపడ్డ నేను.. సమయస్ఫూర్తితో దాన్ని నాగిని డ్యాన్స్‌గా మార్చేశా.. అప్పుడు అందరూ తెగ మెచ్చుకున్నారు.’ అంటూ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఆయన కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికాడ్స్‌లో స్థానం సంపాదించారు. 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆలరించిన ప్రముఖ నటుడిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్వరల్డ్ రికార్డ్ ప్రతినిథుల సమక్షంలో చిరంజీవికి బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తన డ్యాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ‘తనలోని డ్యాన్స్ స్కిల్ తెలుసుకొని ‘ప్రాణం ఖరీదు’లో నాకోసం ప్రత్యేకంగా డ్యూయెట్‌ని క్రియేట్ చేశారు క్రాంతికుమార్. నా డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ అప్పటి దర్శక, నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి నన్ను రికమండ్ చేసేవారు. నా డ్యాన్స్, నా పాటలు ఇవే నా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచప్రఖ్యాతి గాంచిన గిన్నిస్ రికార్డ్స్‌లో నాకు చోటు దక్కడం భాగ్యంగా భావిస్తున్నా. ఒక్క ఫోన్ కాల్‌తో ఆహ్వానించగానే ఈ వేడుకు విచ్చేసిన మిత్రుడు ఆమిర్‌ఖాన్‌కు ధన్యవాదాలు’ అన్నారు చిరంజీవి. ఆమీర్‌ఖాన్ మాట్లాడుతూ ‘నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఈ వేడుకకు పిలిచినప్పుడు ‘విజ్ఞప్తికాదు ఆర్డర్ వేయండి’ అని చెప్పాను. ఈ వేడుకలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్రతి పాటనూ ఆస్వాదించి నర్తిస్తారాయన . అందుకే ఈ గౌరవం’ అని కొనియాడారు. ఇంకా కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, సి.అశ్వనీదత్, డి.సురేశ్‌బాబు, కె.ఎస్.రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, గుణశేఖర్, బాబీ, జెమినీ కిరణ్, మైత్రీ రవిశంకర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తన ఎక్స్ (ట్విటర్) ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న అగ్ర నటుడు చిరంజీవికి అభినందనలు అందించారు. ‘అరంగేట్రం నుంచి ఆధిపత్యం వరకు చిరంజీవిగారి నట ప్రయాణం అపురూపమైనది. 1978లో ఇదే రోజున ‘ప్రాణంఖరీదు’ సినిమాతో ఆయన తెలుగు తెరపై మెరిశారు. 46ఏండ్ల అనితరసాథ్యమైన నటప్రస్థానంతో తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా గర్వించదగ్గ మహానటుడిగా, గొప్ప స్టార్‌గా అవతరించిన ఆయనకు గిన్నిస్ రికార్డ్‌లో స్థానం దక్కడంతో అభిమాన లోకం పండుగ జరుపుకుంటున్నది. 156 సినిమాలు.. 537 పాటలు.. 24000 డాన్స్ మూమెంట్స్.. లెక్కలేనన్ని జ్ఞాపకాలతో కొన్ని కోట్లమందిని రెండుమూడు తరాలుగా మీరు స్పూర్తి నింపుతూనే ఉన్నారు. అభినయంతో నేటికీ మమ్మల్ని మంత్రముగ్థుల్ని చేస్తూనేవున్నారు. మీరు ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా.’ అంటూ కేటీఆర్ తన ఎక్స్(ట్విటర్) ద్వారా చిరంజీవిని కొనియాడారు. ఇంకా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులైన రేవంత్‌రెడ్డి, చంద్రబాబు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు అందించారు.