సుప్రసిద్ధ తమిళ సినీనటుడు, ‘దేసియ ముర్పొక్కు ద్రవిడ కజగం’(డీఎండీకె) రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు మాజీ శాసనసభ్యుడు విజయకాంత్(71) గురువారం చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల దృష్ట్యా గత నెలలో ఆయనను చెన్నయ్ మనప్పాకంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. నెలరోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్న విజయ్‌కాంత్ గురువారం కన్నుమూశారు. తమిళనాట అగ్ర కథానాయకుడిగా పేరు పొందిన విజయ్‌కాంత్ 150కిపైగా చిత్రాల్లో నటించారు. అందులో ఇరవైకి పైగా చిత్రాల్లో పోలీస్ అధికారిగా ప్రేక్షకుల్ని మెప్పించారు.
Vijayakanth | విజయ్‌కాంత్ 1952 ఆగస్ట్ 25న తమిళనాడులో మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. విజయ్‌కాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. 27 ఏండ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు.
‘ఇనిక్కుమ్ ఇలమై’(1979) చిత్రంలో నటుడిగా పరిచయమైన ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన్ను అభిమానులు ‘పురచ్చి కలింజర్’ (విప్లవ కళాకారుడు) అని ప్రేమతో పిలుచుకునేవారు. ‘కెప్టెన్ ప్రభాకరన్’ సినిమా నుంచి ఆయన్ను అభిమానులు ‘కెప్టెన్’ అని అభిమానంతో పిలుచుకునేవారు. తమిళంలో దాదాపు 150 పైచిలుకు చిత్రాల్లో నటించిన విజయకాంత్‌ని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో అభిమానిస్తారు.
ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై అఖండ విజయాలు చవిచూశాయి. విజయకాంత్ హీరోగా, సత్యరాజ్ విలన్‌గా తమిళంలో రూపొందిన ‘నూరవత్తునాళ్’ చిత్రం ‘నూరవరోజు’ (1984) పేరుతో తెలుగులో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే ఆయన తమిళంలో నటించిన ‘సింధూర పువ్వే’(1988) కూడా ‘సింధూరపువ్వు’గా తెలుగులో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. తెలుగులో విజయ్‌కాంత్‌కి స్టార్డమ్ తెచ్చిన సినిమా ‘పోలీస్ అధికారి’(1990). ఈ సినిమాతో తెలుగులో కూడా ఆయనకు మార్కెట్ గణనీయంగా పెరిగింది. కమల్‌హాసన్ తర్వాత తెలుగులో అధిక మార్కెట్ గల హీరోగా విజయ్‌కాంత్ ఎదిగారు.
ఆయన హీరోగా సెల్వమణి దర్శకత్వలో రూపొందిన ‘కెప్టెన్ ప్రభాకర్'(1991) దక్షిణభారత చలనచిత్రచరిత్రలో ఓ సంచలనం. అప్పట్లో ఆ సినిమాను ‘సౌత్ ఇండియన్ షోలే’గా అభివర్ణించారు. ఆయన ైస్టెల్స్, ఫైట్స్ అంటే తమిళ తంబీలకు పిచ్చి. తమిళనటుడు శరత్‌కుమార్‌ని స్టార్‌హీరోగా నిలబెట్టింది కూడా విజయకాంతే. ఆయన నిర్మించిన ‘మరో యుద్ధకాండ’ చిత్రంతో శరత్‌కుమార్ హీరోగా మారారు. ఆ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ బాగా ఆడి, శరత్‌కుమార్‌కి కూడా తెలుగులో మార్కెట్ పెరిగేలా చేసింది. విజయకాంత్ ‘విరుధగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. వల్లారసు, నరసింహ, సగప్తం అనే సినిమాలను నిర్మించారు. తమిళ ఇండస్ట్రీలో ఒకానొక దశలో రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు గట్టి పోటీనిచ్చారు. విజయకాంత్. 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ హానరరీ అవార్డు’ (ఎంజీఆర్ పురస్కారం), 2001లో ‘కళైమామణి అవార్డు’ అందుకున్నారు. వీటితో పాటు పలు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను గెలుచుకున్నారు.
తమిళ చిత్రసీమలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన విజయ్‌కాంత్.. తదనంతరం 2005లో డీఎండీకే అనే రాజకీయపార్టీని స్థాపించారు. అయితే, శాసనసభ్యునిగా రెండుసార్లు విజయం సాధించగలిగారు కానీ, పార్టీని మాత్రం అధికారంలోకి తీసుకురాలేకపోయారు. తమిళనాట కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్‌కాంత్ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు.