‘మల్లేశం’ చిత్రంతో సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టారు నటుడు ఆనంద చక్రపాణి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రతో రాణిస్తున్న ఆయన.. ఇటీవల విడుదలైన ‘రాజు యాదవ్’ చిత్రంలో ట్యాక్సీ డ్రైవర్ రాములుగా కీలక పాత్ర పోషించారు. ఆ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద చక్రపాణి ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న సంగతులు..
కొడుకు భవిష్యత్తు కోసం తపిస్తూ, అతను అప్రయోజకుడైపోతున్నాడని సంఘర్షణ పడే తండ్రిగా ‘రాజు యాదవ్’ చిత్రంలో నా పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. కథ చెప్పినప్పుడు సాధారణంగా అనిపించినా..సెట్స్‌మీదకు వెళ్లిన తర్వాత నా పాత్రలో ఎంతటి బలమైన ఉద్వేగాలు ఉన్నాయో అర్థమైంది
ఈ పాత్రలో నేను పరకాయ ప్రవేశం చేశాను. షూటింగ్ సమయంలో ఓ రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిన భావన కలిగింది. ముఖ్యంగా కొడుకు చావు ఘట్టంలో రాములు ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశాల్లో తాము ఏడుపును ఆపుకోలేకపోయామని చాలా మంది నాతో అన్నారు. ప్రీవ్యూ చూసినప్పుడు నేను కూడా ఏడ్చాను.
‘రాజు యాదవ్’ సినిమాకు సంబంధించిన అనేక రివ్యూలలో నా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ైక్లెమాక్స్ ఘట్టాల్లో నా నటన ప్రధానాకర్షణగా నిలిచిందని రాశారు. ప్రముఖ రచయిత, దర్శకుడు జె.కె.భారవి నా నటన గుండెను మెలిపెట్టిందని చెప్పారు. ‘రాజు యాదవ్’ సినిమా విషయంలో నాకు లభిస్తున్న ప్రశంసలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి
ప్రస్తుతం ‘ఉరుకు పటేలా’ చిత్రంలో సాఫ్ట్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. ‘షష్టిపూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారి సహచరుడిగా మంచి పాత్ర దొరికింది. నిఖిల్ ‘స్వయంభూ’ చిత్రంలో కూడా గ్రామపెద్దగా కథాగమనంలో కీలకమైన పాత్రలో కనిపిస్తాను. ‘గాంధీతాత చెట్టు’ చిత్రంలో తాత పాత్రలో సహజసిద్ధమైన అభినయాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.